మమతా బెనర్జీపై దాడి జరగలేదా? మరి కాలికి ఆ కట్టేంటి?
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నలుగురు వ్యక్తులు దాడి చేయగా, ఆమె కాలుకు దెబ్బతగిలింది. ప్రస్తుతం ఆమె కోల్‌కతా
లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె కాలికి గాయం అయిందని తెలుపుతూ ఆమె కాలికి పెద్ద కట్టుకట్టి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
అయితే, ఎన్నికల నేపథ్యంలో ప్రచారం, ఓటర్ల సానుభూతి పొందడం కోసమే ఆమె ఎన్నికల ఇటువంటి గిమ్మిక్కులు చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. నందిగ్రామ్‌లో ఓ ప్రాంతంలో మమతపై దాడి జరిగిందని టీఎంసీ నేతలు అంటుండగా, అదే సమయంలో ప్రాంతంలో ఉన్న కొందరు ప్రత్యక్ష సాక్షులు మాత్రం అసలు ఆమెకు అక్కడ ఏమీ కాలేదని చెబుతున్నారు.
స్థానిక విద్యార్థి సుమన్ మైతీ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కారులో ఇక్కడకు వచ్చిన సమయంలో చాలా మంది ఆమె చుట్టూ చేరారని అన్నాడు. మమతను ఎవరూ తోయలేదని, అయితే, ఆమె మెడ, కాలికి గాయం అయినట్లు అనంతరం తెలిసిందని, ఆ సమయంలో ఆమె కారు మెల్లిగా కదులుతూ ముందుకు వెళ్లడాన్ని చూశానని చెప్పాడు.
చిత్రంజన్ దాస్ అనే మరో వ్యక్తి మాట్లాడుతూ... 'నేను ఆ సమయంలో అక్కడే ఉన్నాను. ఆమె కారులోనే కూర్చుని ఉన్నారు. అయితే, కారు తలుపు తెరుచుకుని ఉంది. ఆ తలుపు ఓ పోస్టర్‌కు తగలగానే దాన్ని మూసేశారు. ఆమెను ఎవ్వరూ తోసేయలేదు, కొట్టలేదు. ఆ కారు తలుపు వద్ద ఆ సమయంలో ఎవ్వరూ లేరు' అని తెలిపాడు.