శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 మార్చి 2021 (09:47 IST)

మమతా బెనర్జీ టిక్కెట్లు ఇవ్వలేదనీ.. కాషాయం కండువా కప్పుకున్నారు...

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఐదేళ్లపాటు అధికారాన్ని అనుభవించిన పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఇపుడు కాషాయం పార్టీలోకి వెళ్లిపోతున్నారు. కారణం.. ఈ ఎన్నికల్లో కూడా తమకు పోటీ చేసేందుకు టిక్కెట్లు కేటాయించలేదన్న అక్కసుతో బీజేపీలోకి వలసలు పోతున్నారు. 291 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 29 మధ్య ఎనిమిది విడతల్లో పోలింగ్ జరుగనున్న విషయం తెల్సిందే.
 
నిజానికి బెంగాల్ కోటపై కన్నేసిన బీజేపీ.. ఇటీవల కాలంలో తృణమూల్‌ నేతలను ఆకర్షిస్తూ, వరుసగా తమ పార్టీలో చేర్చుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఐదుగురు తృణమూల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఇది టీఎంసీకి గట్టి ఎదురుదెబ్బవంటిదేనని చెప్పొచ్చు. 
 
ఎమ్మెల్యేలు సోనాలి గుహ, సీతల్‌ సర్దార్‌, దీపేందు బిశ్వాస్‌, రవీంద్రనాథ్‌ భట్టాచార్య, జతు లహిరిలు కమల దళంలో చేరి దీదీకి గట్టి షాకిచ్చారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు హబీబ్‌పూర్‌ అభ్యర్థి సరళా ముర్ము కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. 
 
పోటీపడి మరీ టికెట్‌ తెచ్చుకున్న అభ్యర్ధులు కూడా పార్టీని వీడుతుండంతో దీదీకి పాలుపోవడం లేదు. పార్టీ ఫిరాయించిన నేతలంతా రాష్ట్ర బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌, అగ్ర నేతలు సువేందు అధికారి, ముకుల్‌ రాయ్‌ల సమక్షంలో బీజేపీలో చేరారు. 
 
ఎన్నికలకు ముందు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కాషాయ పార్టీలో చేరడంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ పరిస్థితి దయనీయంగా మారింది. గతవారం బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ల సమక్షంలో మాజీ కేంద్ర రైల్వే మంత్రి, టీఎంసీ నేత దినేష్‌ త్రివేది బీజేపీలో చేరగా, ఇటీవల కోబ్రా మిథున్‌ చక్రవర్తి కూడా కమలదళంలో చేరారు.