మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (12:29 IST)

ఐదు రాష్ట్రాలకు మోగనున్న ఎన్నికల నగారా : ఈ రోజు షెడ్యూల్ రిలీజ్

దేశంలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు.. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే, ఉత్తరాదిలో వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల శాసనసభలకు త్వరలో ఎన్నికలు నిర్వహించాల్సివుంది. వీటికి ఎన్నికల తేదీలను భారత ఎన్నికల కమిషన్ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. 
 
శుక్రవారం మధ్యాహ్నం 4.30 గంటలకు మీడియా సమావేశాన్ని ఈసీ ఏర్పాటు చేసింది. కాగా, పశ్చిమబెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు గత బుధవారంనాడు ఈసీ సమావేశమైంది. ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ నేపథ్యంలో శనివారం పూర్తి స్థాయి ఎన్నికల షెడ్యూల్‌ను రిలీజ్ చేసేందుకు ఈసీ సిద్ధమైంది. 
 
కాగా, తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, పశ్చిమబెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అలాగే, అసోంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా, కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. 
 
కరోనా నేపథ్యంలో గత అక్టోబర్, నవంబర్‌లో ఈసీ కీలకమైన బీహార్ ఎన్నికలు నిర్వహించింది. కాగా, తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లోనూ ఎన్నికల వేడి పెరుగుతుండటం, భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని బీహార్‌లో అమలు చేసిన ప్రోటోకాల్స్‌నే తాజా ఎన్నికల్లోనూ ఈసీ ప్రకటించే అవకాశం ఉంది.