మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (12:51 IST)

ఆ ఐదు రాష్ట్రాల వాసులకు హస్తినలోకి నో ఎంట్రీ..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ ఊపందుకుంది. ముఖ్యంగా, ఐదు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రంతోపాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ జాబితాలో ఇపుడు ఢిల్లీకూడా చేరిపోయింది. 
 
ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్ నుంచి విమానాలు, రైళ్లలో వచ్చే వారికి ఈ నిబంధనను అమలు చేయనున్నారు. ఆ రాష్ట్రాల నుంచి ఎవరైనా ఢిల్లీ రావాలనుకుంటే.. ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టును చూపిస్తేనే అనుమతించేలా నిబంధన పెడుతున్నారు. ఈ కొత్త నిబంధన శుక్రవారం నుంచి అమలు చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
మార్చి 15 దాకా ఈ కొత్త నిబంధనలు అమల్లో ఉండనున్నట్టు సమాచారం. దీనిపై ఈరోజు సాయంత్రం అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్ నుంచి విమానాలు, రైళ్లలో వచ్చే వారికి ఈ నిబంధనను అమలు చేయనున్నారు. 
 
వారం రోజులుగా దేశంలో నమోదవుతున్న కేసుల్లో 86 శాతం కేసులు ఈ ఐదు రాష్ట్రాల నుంచే వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ విమానం ఎక్కేముందు ప్రయాణికులు టెస్టు చేయించుకున్న రిపోర్టును ఆయా రాష్ట్రాల అధికారులే పరిశీలించనున్నారు. కాగా, ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఇలాంటి ఆంక్షలే విధించాయి.