ప్రతీ 4 గంటలకు అత్యాచారం, 17గంటలకు హత్య, 12 నిమిషాలకు చోరీ
ఢిల్లీ నేరాల అడ్డాగా మారింది. క్రైమ్ రేటు తగ్గినా.. ఢిల్లీలో నేరాల సంఖ్య మాత్రం తగ్గలేదు. దేశ రాజధాని ఢిల్లీలో 2020లో జరిగిన నేరాలకు సంబంధించిన డేటా వెల్లడైంది. దీని ప్రకారం.. నగరంలో గతేడాది ప్రతీ ఐదు గంటలకు ఒక అత్యాచారం, ప్రతీ 19 గంటలకు ఒక హత్య, ప్రతీ 15 నిమిషాలకు ఒక చోరీ జరిగాయి.
నిజానికి 2019తో పోలిస్తే 2020లో ఢిల్లీలో క్రైమ్ రేటు 16శాతం మేర తగ్గడం గమనార్హం. 2019లో ప్రతీ నాలుగు గంటలకొక అత్యాచారం, ప్రతీ 17 గంటలకు ఒక హత్య, ప్రతీ 12 నిమిషాలకు ఒక చోరీ చోటు చేసుకున్నట్లు గత డేటా చెబుతోంది.
మొత్తంగా 2020లో ఢిల్లీలో 1699 అత్యాచార ఘటనలు,2168 లైంగిక వేధింపుల ఘటనలు,చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు 65 చోటు చేసుకున్నాయి. 2019తో పోల్చితే 2020లో కేసులు స్వల్ప మేర తగ్గాయి.
2019లో మొత్తం 2168 అత్యాచార ఘటనలు,2921 లైంగిక వేధింపుల ఘటనలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు 109 నమోదయ్యాయి. చాలా ఏళ్ల తర్వాత మొదటిసారి ఢిల్లీలో మహిళలపై అన్ని రకాల నేరాలు తగ్గినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.