శనివారం, 5 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 అక్టోబరు 2016 (13:44 IST)

జయలలిత వారసుడిగా హీరో అజిత్ కుమార్.. అమ్మ వీలునామా .. నిజమేనా?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వారసుడిగా సినీ హీరో అజిత్ పేరు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వీలునామా రాసినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు తమిళనాడుతో పాటు.. సోషల్

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వారసుడిగా సినీ హీరో అజిత్ పేరు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వీలునామా రాసినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు తమిళనాడుతో పాటు.. సోషల్ మీడియాలోనే కాక, కొన్ని వార్తా సంస్థలు కూడా అజిత్ కుమారే జయ వారసుడని పేర్కొంటున్నాయి.
 
తీవ్ర అనారోగ్యానికి గురైన జయలలిత గత నెల 22వ తేదీ నుంచి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంపై వివిధ రకాల వదంతులు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జయలలిత వారసుడు ఎవరన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అదేసమయంలో జయలలిత ఆరోగ్యంగా ఉన్న సమయంలో తన వారసుడిగా హీరో అజిత్ కుమార్‌ పేరును పేర్కొంటూ వీలునామా రాసిపెట్టినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
నిజానికి సినీ హీరోగా అజిత్‌కు ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. పైగా వివాదరహితుడు, సేవాతత్పరుడేకాక సీఎం జయలలితను కన్నతల్లిగా భావిస్తారు. ఇదే విషయాన్ని పలు వేదికలపై బాహాటంగా చెప్పారు కూడా. ఆసుపత్రిలో చేరడానికి చాలా రోజుల ముందే అజిత్‌ను ఇంటికి పిలిపించుకున్న జయ.. ఏఐడీఎంకే పార్టీ వాస్తవ పరిస్థితులు, భవిష్యత్ నిర్మాణం తదితర విషయాలపై చర్చించినట్లు ప్రచారం సాగుతోంది. అన్ని విషయాలు ఆలోచించాకే జయ.. అజిత్‌ను వారసుడిగా ఎంపికచేసుకున్నారని, ఈ మేరకు వీలునామాలో రాసి ఉంచారని, ఇప్పుడా వీలునామా జయకు అత్యంత నమ్మకస్తులైనవారి దగ్గరుందని పలువురు చర్చించుకుంటున్నారు.
 
అంతేకాదు.. అజిత్ ఎంపిక పార్టీలోని పెద్దలందరికీ సమ్మతమేనని తెలుస్తోంది. గతంలో రెండు సార్లు అమ్మ కోసం ముఖ్యపదవిని చేపట్టిన పన్నీర్ సెల్వం పట్ల ఎలాంటి వ్యతిరేకత లేకపోయినప్పటికీ, భవిష్యత్తులో ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టడానికి ఆయనకున్న జనాకర్షణ సరిపోదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే చాలామంది అజిత్ వైపు మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.