సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 అక్టోబరు 2024 (15:54 IST)

మరో నాలుగేళ్లకు ముఖ్యమంత్రి సీట్లో కూర్చొంటా : కేంద్ర మంత్రి హెచ్.డి.కుమారస్వామి

kumaraswamy
మరో నాలుగేళ్లలో తాను ముళ్లీ ముఖ్యమంత్రి సీటులో కూర్చొంటానని కేంద్ర మంత్రి హెచ్.డి.కుమారస్వామి జోస్యం చెప్పారు. ప్రస్తుతం కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, కానీ ఆ పార్టీ నేతల్లో ఐక్యతలేమి, అంతర్గత కలహాల కారణంగా ఆ ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నారు. ఆ తర్వాత ప్రజలు కోరుకుంటే తాను ముఖ్యమంత్రి సీట్లో కూర్చొంటాననిజోస్యం చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రజలు కోరుకుంటే తాను ముఖ్యమంత్రిని అవుతానని.. వారు తనకు మరో అవకాశం ఇస్తారని నమ్ముతున్నానని కుమారస్వామి అన్నారు. 2028లోపు వారి మద్దతుతో సీఎంగా బాధ్యతలు చేపట్టి, మరింత అద్భుతంగా పని చేస్తానని పేర్కొన్నారు. గతంలో కర్ణాటక సీఎంగా తాను చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు.
 
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలే దానిని పడగొడతారని కుమారస్వామి అన్నారు. 'రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ప్రజలు ఎమ్మెల్యేల పట్ల ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ప్రభుత్వ నేతల్లో రోజురోజుకు అసంతృప్తి పెరిగిపోతోంది. దీని వల్ల పార్టీకి నష్టం పొంచి ఉంది. ఈ విభేదాలు త్వరలోనే బయటకు వస్తాయి. అప్పటి వరకు వేచి చూడాల్సిందే' అని ఆయన వ్యాఖ్యానించారు.
 
కాగా, గత 2006 - 2007, 2018 మే నుంచి 2019 జూలై వరకు కుమారస్వామి రెండుసార్లు ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ప్రస్తుతం కేంద్ర ఉక్కుశాఖ మంత్రిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.