శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 మే 2021 (15:08 IST)

పసుపు గీత దాటితే టోల్ చెల్లించనక్కర్లేదు... ఎన్.హెచ్.ఏ వెల్లడి

వాహనదారులకు నేషల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్.హెచ్.ఏ.ఐ) శుభవార్త చెప్పింది. టోల్ బూత్‌ల వద్ద ఇకపై రుసుం చెల్లించనక్కర్లేదని పేర్కొంది. అయితే, ఇక్కడో మెలిక వుంది. వంద మీటర్ల దూరంలో ఉండే పసుపు గీతలను తాకుతూ వాహనాల క్యూ ఉంటే.. ఈ టోల్‌చార్జి చెల్లించనక్కర్లేదని పేర్కొంది. 
 
ఇప్పటికే జాతీయ రహదారులపై ఉండే టోల్‌ప్లాజాల్లో వాహనాల రద్దీని తగ్గించేందుకు ఫాస్టాగ్‌ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అప్పటికీ కొన్ని వాహనదారులు ఈ వెసులుబాటును ఉపయోగించడం లేదు. దీంతో టోల్‌ బూత్‌ల వద్ద రుసుములు చెల్లించేందుకు వాహనాలు భారీగా క్యూల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఇలాంటి వాహనదారుల కష్టాలు తీర్చేందుకు ఎన్‌హెచ్‌ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి టోల్‌ వద్ద 100 మీటర్ల దూరంలో పసుపు గీతలు గీయనున్నట్లు వెల్లడించింది. టోల్‌ రుసుము చెల్లించేందుకు క్యూలో ఉన్న వాహనాలు ఈ గీతను తాకితే చాలు.. టోల్‌ నిర్వాహకులు వరసలో ఉన్న వాహనాలన్నింటినీ రుసుము వసూలు చేయకుండానే పంపేయాల్సి ఉంటుంది. ఈ మేరకు బుధవారం ఎన్‌హెచ్‌ఏఐ మార్గదర్శకాలు విడుదల చేసింది.
 
టోల్‌ ప్లాజాల వద్ద నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అలాగే, ఒక్కో వాహనానికి రుసుము వసూలు లావాదేవీ సమయాన్ని 10 సెకన్లకు మించకుండా చూడనున్నట్లు వివరించింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలోనూ 10 సెకన్లలోనే లావాదేవీలు ముగించేలా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.