గురువారం, 21 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (11:46 IST)

సీతమ్మ నుదుటన సింధూరం.. హనుమంతుడు ఏం చేశాడంటే?

రామబంటు హనుమంతుడు చైత్రపూర్ణిమ నాడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆ రోజున వాయుపుత్రుడైన హనుమంతుడిని పూజించడం ద్వారా శరీరానికి బలాన్ని, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడని విశ్వాసం. లక్ష్మణునికి సంజీవని కోసం పర్వతాన్నే లేవనెత్తిన హనుమంతుడు.. దుష్టశక్తుల నుంచి కాపాడుతాడని.. ఆయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు కోరిన కోరికలను నెరవేర్చుతాడని నమ్మకం. అలాంటి హనుమయ్యను హనుమజ్జయంతి రోజున ఎలా పూజించాలంటే..?
 
* హనుమాన్ చాలిసాను ఈ రోజున పఠించడం ద్వారా వాయుపుత్రుడి అనుగ్రహం పొందవచ్చు. హనుమాన్ చాలీసా ధైర్యాన్ని, శక్తి, కొత్త ఉత్తేజాన్ని ప్రసాదిస్తుంది.
 
* హనుమాన్ జయంతి రోజున హనుమాన్ ఆలయాన్ని సందర్శించుకోవడం ఉత్తమం. ఆలయాల్లో లభించే సింధూరం నుదుటన ధరించి.. హనుమాన్ ఆలయంలో ఇచ్చే లడ్డూ, బూందీలను ప్రసాదంగా స్వీకరిస్తే ఆయురారోగ్యాలు చేకూరుతాయి.
 
ఆరెంజ్ రంగు దుస్తుల్ని ధరించడం లేదా.. హనుమాన్‌కు నారింజ రంగు వస్త్రాలను సమర్పించుకుంటే సర్వ సంకల్పాలు సిద్ధిస్తాయి. ఇక రామాలయాన్ని కూడా హనుమజ్జయంతి రోజున దర్శించుకోవడం సర్వ శుభాలను ప్రసాదిస్తుందని పండితులు అంటున్నారు.
 
హనుమంతుడి పేరు చెబితే భయపడి పారిపోతాయి. మహా రోగాలు మటుమాయం అవుతాయి. శని ప్రభావం వల్ల కలిగే బాధలూ తొలగిపోతాయి. హనుమంతుడికి ఐదు అనే సంఖ్య చాలా ఇష్టం. అందుకే ఆయన ఆలయానికి ఐదుసార్లు ప్రదక్షిణలు చేయాలి. అరటి, మామిడి పళ్లు అంటే ఆయనకు ప్రీతి. హనుమాన్ చాలీసాను చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి వరకు మండలం కాలం పాటు రోజుకు ఒకటి, మూడు, ఐదు, పదకొండు, లేదా 41 సార్లు పారాయణం చేస్తారు. 
 
దీని వల్ల చేపట్టిన కార్యం, అనుకున్న పనులు త్వరితంగా పూరై, మనసులోని కోరికలు నెరవేరుతాయి. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు మండల కాలం పాటు హనుమాన్ చాలీసా పారాయణ చేసి అరటిపండు నివేదించాలి. ఈ ఫలాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే తప్పకుండ సంతానం భాగ్యం కలుగుతుందని భావిస్తారు.

సీతమ్మ తల్లి రాముడు దీర్ఘాయుష్షుగా వుండాలని సింధూరం నుదుటన ధరించిందని తెలిసి హనుమంతుడు శరీరమంతా సింధూరాన్ని రాసుకుంటాడు. అందుకే సింధూరం ధరించే వారికి హనుమంతుడు కోరిన కోరికలను నెరవేరుస్తాడని విశ్వాసం.