శనివారం, 9 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2019 (16:09 IST)

అలా చేస్తే యమధర్మరాజు ఏం చేస్తాడో తెలుసా? (వీడియో)

మహాలయ అమావాస్య శనివారం పూట రావడం విశేషమని పండితులు చెప్తున్నారు ఈ శనివారం పూట శ్రాద్ధకర్మలు చేయడం ద్వారా పితృదేవతలు సంతృప్తి చెందుతారని వారు చెప్తున్నారు. అందుకే ఈ నెల 28వ తేదీన వచ్చే మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం చేస్తే ఈతిబాధలుండవని పండితుల వాక్కు. 
 
మహాలయ అమావాస్య రోజున పితృదేవతలు తర్పణాలిచ్చే వారి ఇంటికి యమధర్మరాజు ఆశీస్సులు కూడా లభిస్తాయని విశ్వాసం. ఆ ఇంటిని శత్రుబాధల నుంచి యముడు కాపాడుతాడని చెప్తుంటారు. మహాలయ అమావాస్య రోజున పూర్వీకులు ఇంటిని సందర్శిస్తారని, వారి తరపున శ్రాద్ధ కర్మలు చేయడం ద్వారా వారి సంతోషంతో తిరిగి వెళ్తారని.. వారి ఆశీస్సులు ఆ ఇంటికి లభిస్తాయని విశ్వసిస్తారు. పూర్వీకుల ఆత్మలు మోక్షం పొందాలంటే మహాలయ అమావాస్య రోజున వారి శాంతి కోసం తర్పణాలు ఇవ్వాల్సిందే. 
 
మహాలయ పక్షంలో ఆచారం ఉన్నవారు యథావిధిగా అన్నసంతర్పణ, పితృశ్రాద్ధాలు నిర్వర్తించడం చేయవచ్చు. ఇప్పటి వరకు ఆ అలవాటు లేనివారు కనీసం ఏదైనా దేవాలయంలో బియ్యం, కూరగాయలు, ఉప్పు, పప్పు, పండ్లు దక్షిణ తాంబూలాదులతో విప్రులకు స్వయంపాకం సమర్పించడం లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులతో ఎంతోకాలంగా తీరని కోరికలు తప్పక నెరవేరతాయని విశ్వాసం. 
 
ఎప్పుడో మరణించిన పితృదేవతలకు తర్పణలు వదలడం, గతించిన పెద్దలను తలచుకుని వారి పేరిట అన్నదానం చేస్తే వారికి కడుపు, మనకు మనసు నిండుతాయి. భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు బహుళ పక్షం పితృ దేవతా పూజకు విశిష్టమైనది. ఈ బహుళ నుంచి భాద్రపద మాసం బహుళ పక్షం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనిని పితృపక్షం అంటారు.
 
అలాగే ఈ పక్షాన్ని మహాలయ పక్షం అని కూడా అంటారు. ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు. పక్షం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకూ పితృ దేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలని పురోహితులు చెబుతున్నారు.
 
ఒకవేళ అలా కుదరనప్పుడు తమ పితృ దేవతలు ఏ తిథినాడు మృతి చెందారో అదే తిథినాడు శ్రాద్ధం నిర్వహించాలి. తండ్రి జీవించి ఉండగా తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షం నవమి తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు. ఈ పదిహేను రోజులూ నియమపూర్వకంగా పితృదేవతలకు తర్పణాదుల ద్వారా తృప్తి కలిగించాలి. లేకుంటే మహాలయ అమావాస్య రోజున మాత్రం శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు.
 
ఉత్తరాయణం దేవతల కాలం గనుక ఉత్తమ కాలమని, దక్షిణాయనం పితృకాలం గనుక అశుభమని పూర్వీకుల విశ్వాసం. అంతేకాక ఆషాఢంలో వచ్చే కర్కోటక సంక్రమణ నుంచే ప్రారంభమయ్యే దక్షిణాయనం వానలు, బురద, చిమ్మచీకటితో భయంకరమవుతుంది. అశుభమనిపిస్తే ఆశ్చర్య పడాల్సిన పనిలేదు.
 
అందులో భాద్రపద మాసమంతా జలమయంగా కనిపిస్తుంది. ఇదే ఒక మహా వినాశనం అనుకోవడంలో ఆశ్చర్యం అంతకంటే లేదు. కావున ఈ పక్షంలో అందరికీ శ్రాద్ధ తర్పణములు చేయాలని శ్రాద్ధాలతో వారిని సంతృప్తి పరిస్తే తమకు ప్రళయం గడుస్తుందని భావించి ఉండవచ్చు. అంతేకాక ఆషాఢం రెండవ పక్షం మొదలు ఐదవ పక్షం వరకు పితురులు చాలా కష్టపడుతుంటారు. కాబట్టి మహాలయ పక్షంలో ప్రతిరోజూ శ్రాద్ధం జరపాలని ఆచారంగా పెట్టారు.
 
పితురులను తృప్తిపరచే ఈ కర్మల ద్వారా పితృ రుణం తీర్చుకునే అవకాశం ఇది. స్వర్గుస్తులైన మాతాపితురుల కోసం ప్రతీవారు ఈ పక్షాలలో పితృ కర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సు పొందగలుగుతారు. భాద్రపద పూర్ణిమతో అరంభమైన పితృపక్షం, మహాలయ పక్షం ఆ మాసపు అమావాస్యతో ముగుస్తుంది.