శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (12:06 IST)

శ్రీవారి ఆలయంలో పని - గోదాములో నిద్ర

ప్రతియేటా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియగానే తితిదే పనిచేసే ఉద్యోగ, కార్మికులందరికీ బ్రహ్మోత్సవ బహుమానం, శ్రీవారి లడ్డూ వడ ఇస్తారు. దేశంలో ఏమూల పనిచేస్తున్నా ఉద్యోగికైనా ఇది అందుతుంది. అయితే సాక్షాత్తు

ప్రతియేటా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియగానే తితిదే పనిచేసే ఉద్యోగ, కార్మికులందరికీ బ్రహ్మోత్సవ బహుమానం, శ్రీవారి లడ్డూ వడ ఇస్తారు. దేశంలో ఏమూల పనిచేస్తున్నా ఉద్యోగికైనా ఇది అందుతుంది. అయితే సాక్షాత్తు స్వామివారి ఆలయంలో పనిచేస్తున్న కొందరికి మాత్రం లడ్డూ, వడ భాగ్యం లేదు. ఆలయంలో పనిచేసే అర్చకులు, ఉద్యోగులు విశ్రాంతి తీసుకోవడానికి తిరుమలలోనే వసతి గదులు ఉంటాయి. కానీ 24 గంటలూ ఆలయానికి అందుబాటులో ఉండే వారికి మాత్రం అలాంటి సదుపాయం లేదు. గోదాములో తలదాచుకుంటున్నారు.
 
ఈ రెండు ఉదాహరణలు చాలు. ఇది ఎంత అధర్మమో చెప్పడానికి. తిరుమల శ్రీవారి ఆలలయంలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న కార్మికులు తీవ్ర నిర్లక్ష్యానికి, వివక్షకు గురవుతున్నారు. శ్రీవారి ఆలయంలో పాటు నాలుగు మాఢావీధుల్లో అవసరమైన సివిల్‌ పనులు చేయడం కోసం తితిదే 26 మందిని కాంట్రాక్టు పద్ధతిపై నియమించింది. ఇందులో ఏడుగురు కార్యాలయంలోనే పనిచేస్తుండగా, 19 మంది ఫీల్డ్‌లో పనిచేస్తుంటారు.
 
ఆలయంలో పాటు 4 మాఢా వీధుల్లో క్యూలైన్లు ఏర్పాటు చేయాల్సి వచ్చినా, తొలగించాల్సి వచ్చినా, ఏదైనా నిర్మాణం చేపట్టాల్సి వచ్చినా ఈ కార్మికులే చేయాలి. ఆలయం నుంచి పిలుపు వస్తే అర్థరాత్రి అయినా వెళ్ళి పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే వీరు ఇళ్లకు వెళ్లరు. ఆలయ సమీపంలోని బూందీపోటు వద్ద ఉన్న సివిల్‌ గోదాములోనే, సిమెంట్ బస్తాల మధ్యే తలదాచుకుంటున్నారు. బ్రహ్మోత్సాల సమయంలోనైతే రెండు నెలల ముందు నుంచే క్షణం తీరిక లేనంత పని ఉంటుంది. ఇక ఉత్సవాలు జరిగే సమయంలో కంటిమీద కునుకు ఉండదు. వాహనాలతోనే ఉండాలి. ఈ విధంగా 10 సంవత్సరాలు పనిచేస్తున్నా వీళ్ళకు ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సదుపాయం కూడా లేదు. 
 
చాలామంది అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులకు బస్‌పాస్‌ ఇస్తున్నా వీరికి మాత్రం ఇవ్వడం లేదు. పనిచేసిన రోజు 255 రూపాయల కూలీ ఇస్తున్నారు. ఈ విధంగా దాదాపు 10 సంవత్సరాల పాటు నుంచి పని చేయించుకుంటున్నారు. వేతనాలు బ్యాంకు ద్వారా ఇవ్వరు. పొలం పనులు చేసే కూలీలకు ఇచ్చినట్లు ఏ నెలకు ఆ నెల చేతిలో పెడతారు. కనీసం కార్మికుల అటెండన్స్ రిజిస్టర్ ఉండదు. ప్రతినెలా ఆలయ బయోమెట్రిక్‌ సెంటర్‌ నుంచి గుర్తింపు కార్డు ఇస్తారు. దాన్ని పెట్టుకుని ఆలయంలోకి వెళ్ళి పని చేసుకుని రావాలి. ఈ కార్డు తీసుకుని ఎంప్లాయిస్‌ క్యాంటీన్‌కు భోజనానికి వెళ్ళినా అనుమతించరు. బయట హోటళ్ళలో తినాలి. లేకుంటే ఉచిత అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళాలి. రోజూ ఇంటికి వెళ్ళే అవకాశం లేదు. అక్కడే ఉండాలంటే విశ్రాంతికి గదిలేదు. జీతం భోజనాలకే సరిపోదు. అయినా ఏనాటికైనా స్వామి కరుణించకపోతాడా అనే ఆశతో పనిచేస్తున్నారు.
 
ఆలయంలో పనిచేస్తున్న సివిల్‌ కాంట్రాక్టు కార్మికులకు ఈఎస్‌ఐ, పిఎఫ్ సదుపాయం, బస్‌పాస్‌ల గురించి ఎన్నిసార్లు అధిఆరులను అడిగినా పట్టించుకోవడం లేదు. కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌లు చెల్లించినా టెండరు నిబంధనల్లో ఉన్నా అమలు గురించి ఇంజనీరింగ్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ సదుపాయాలు కల్పించాలని ఎన్నిసార్లు అడిగినా ఇవన్నీ మీకు వర్తించవు అని చెప్పి తప్పించుకుంటున్నారు. అర్థరాత్రి సమయంలోనైనా పనిచేయడానికి సిద్ధంగా అందుబాటులో ఉండే కార్మికుల విషయంలో ఇలా వ్యవహరించడం ధర్మమా..!
 
ఆలయ సివిల్‌ కాంట్రాక్టు కార్మికులు ఆలయం, మాఢావీధుల్లో మాత్రమే పనిచేయాల్సి ఉన్నా తిరుమలలో ఎక్కడ పని ఉన్నా, ఆఖరుకి ఇతర కాంట్రాక్టర్లు చేయాల్సిన పనులకైనా వీరిని పంపిస్తున్నారట. అంతేకాదు తమను చులకనగా చూస్తున్నారని, కొందరు రెగ్యులర్‌ ఉద్యోగులు తమను బూతులు తిడతారని వాపోతున్నారు. వాస్తవంగా ఈ సెక్షన్‌లో 10 మంది రెగ్యులర్‌ ఉద్యోగులున్నా వాళ్లు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోతారు. 24 గంటలూ అందుబాటులో ఉండేది కాంట్రాక్టు కార్మికులు మాత్రమే. మేము అదనపు సౌకర్యాలు అడగడం లేదు. అందరు కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు ఇస్తున్నట్లు జీఓ ప్రకారం జీతాలు ఇవ్వమంటున్నాం. ఈఎస్‌ఐ, పిఎఫ్‌ అడుగుతున్నాం. బస్‌పాస్‌ కావాలంటున్నాం. 24 గంటలూ స్వామి ఆలయంలో పనిచేసే మా కష్టాలు ఎప్పటికైనా తీరుతాయన్నది మా నమ్మకం అని కార్మికులకు ఆవేదనతో చెబుతున్నారు. స్వామివారి ఆలయంలోనే అధర్మకం కొనసాగడం భావ్యం కాదు. ఈఓ సాంబశివరావు మానవతా దృక్పథంలో ఆలోచించి మా సమస్య పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు.