శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : మంగళవారం, 14 జూన్ 2016 (12:30 IST)

తిరుమల కుమార తీర్థం మహిమ ఇంతింత కాదయా..!

పూర్వం ఒక వృద్ధ బ్రాహ్మణుడు తన కుమారుడైన కౌండిన్లతో కలిసి దేశ సంచారం చేస్తూ ఆయా దివ్య ప్రదేశాలను దర్శిస్తూ చివరకు వేంకటా చలక్షేత్రం చేరుకున్నాడు. ఆ సమయంలో తన కొడుకు తప్పిపోవడంతో ఆ వృద్థుడు అతన్ని వెతక

కలియుగ వైకుంఠం తిరుమలలోని ఏ ప్రాంతమైనా ప్రాముఖ్యత కలిగిందే. అసలు తిరుమలను మొదట్లో సాలిగ్రామం అని పిలిచేవారు. ఏడు కొండలు ఏడు సాలిగ్రామాలు. ఋషులు, మహర్షులు ఈ ప్రాంతంలో నివసించేవారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే తిరుమల గిరులలోని ఏ ప్రాంతానికైనా ఒక్కో చరిత్ర ఉంటుంది.
 
తిరుమల శ్రీనివాసుడు కొలువై ఉన్న ప్రాంతంలోని తీర్థాలు కూడా అంతే ప్రాముఖ్యత కలిగింది. ఆలయానికి కుడివైపున ఉన్న శ్రీవారి పుష్కరిణిలోనే తొమ్మిది తీర్థాలు ఉండగా.. వివిధ ప్రాంతాల్లో ఎన్నో తీర్థాలున్నాయి. అందులో ప్రధానమైంది కుమారతీర్థం. కుమారతీర్థం గురించి పురాణాలు కథలు కథలుగా చెబుతుంటాయి. 
 
పూర్వం ఒక వృద్ధ బ్రాహ్మణుడు తన కుమారుడైన కౌండిన్లతో కలిసి దేశ సంచారం చేస్తూ ఆయా దివ్య ప్రదేశాలను దర్శిస్తూ చివరకు వేంకటా చలక్షేత్రం చేరుకున్నాడు. ఆ సమయంలో తన కొడుకు తప్పిపోవడంతో ఆ వృద్థుడు అతన్ని వెతకడం మొదలెట్టాడు. ఈ ముసలి వాణ్ణి విడిచి వెళ్ళడం న్యాయమా అంటూ బిగ్గరగా అరిచాడు. ఈ ప్రాంతంలోనే అందంగా, సుందర రూపమై తిరుగుతున్న శ్రీవారు బ్రాహ్మణుడికి కనిపించాడు.
 
వెంటనే శ్రీనివాసుడు ముదుసలితో అయ్యా.. నీకు కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు. చెవులు వినిపించడం లేదు. ఎవరి కోసం వెతుకుతున్నావు అని ప్రశ్నించాడు. అయ్యా మీరెవరో ఆప్యాయంగా పలుకరిస్తున్నారు. నా గురించి ఆశక్తిగా అడుగుతున్నారు. నా పుత్రుడు కౌండిన్య కనిపించడం లేదంటూ వృద్ధుడు చెప్పుకొచ్చాడు. నన్ను మీరే కాపాడాలంటూ వేడుకొన్నాడు. 
 
అయ్యా బ్రాహ్మణుడా.. వృద్ధాప్యం చేత నీ శరీరం చిక్కి శల్యమైంది. తెల్లగా పాలి ఉంది కూడా. నీ కనురెప్పలు, చర్మం వాలిపోయింది. ఇలాంటి పరిస్థితిలో కూడా పుత్రుని వ్యామోహం మాత్రం తగ్గలేదు. అసలు పుత్ర వ్యామోహాన్ని వదిలి నిశ్చింతంగా ఉండు అని ధైర్యం చెప్పాడు శ్రీనివాసుడు. అంతేకాదు  నీవు పలుకుతున్న మాటలు సత్యంగా భావించి నీకు ముక్తిని ప్రసాదిస్తున్నాను. నీకు సమంజసమేనా అన్నాడు.
 
దీంతో ఆ వృద్ధుడు నేను ఇక ఈ వృద్థాప్యంలో ఉండలేనంటూ స్వామివారిని వేడుకొన్నాడు. నేను ఇప్పటి వరకు నిత్య కర్మలకు గాని, జ్యోతిష్టోమాదులైన యజ్ఞాలను కానీ చేయలేదు. దేవ పితృయజ్ఞాది కార్యక్రమాలు కూడా చేయనందువల్ల దేవతలకు, పితురులకు ఋణగ్రస్థుడయ్యాను అనగానే శ్రీనివాసుడు వెంటనే ఆయన చేతులు పట్టుకుని పక్కనే ఉన్న స్వచ్ఛమైన జలధారను చూపుతూ ఇందులో స్నానమాచరించి ఆశ్రమానికి వెళ్లు అని చెప్పాడు.
 
వృద్ధుడు స్నానం చేయగానే పదహారేళ్ళ నవ యువకుడిగా మారిపోయాడు. వృద్ధుడికి యువకుడిగా కనిపించిన శ్రీనివాసుడు వేయి కన్నులతో, సహస్ర శీర్షుడై, విశ్వరూపంతో దర్శనమిచ్చాడు. అంతేకాదు షణ్ముఖుడైన కుమారస్వామి దేవతల ప్రార్థనలపై పూర్వం దేవ సేనాధిపతిగా అంగీకరించాడు. ఇంతలో దేవతలకు తారకాసురునికి తీవ్రమైన యుద్ధం జరిగింది. ఆ ఘర్షణలో దేవసేనాధిపతియైన కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించాడు. అందువల్ల బ్రహ్మహత్యాదోషం కుమారస్వామి వెంటపడింది. దాన్ని పోగొట్టుకోవడానికి ఎక్కడెక్కడో తిరిగి చివరకు కైలాసానికి చేరుకుని పరమేశ్వరుణ్ణి శరణు కోరతాడు. 
 
కైలాసనాథుడు నీవు వెంటనే భూలోకంలోని వేంకటాచలానికి వెళ్ళు. అక్కడ ఒక పుణ్యతీర్థం ఉంటుంది. అక్కడ పుణ్యస్నానమాచరించు అని చెప్పాడు. అలా కుమారస్వామి ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల ఆ తీర్థానికి కుమార తీర్థం అని పేరు వచ్చింది. అంతేకాదు స్వయంగా పార్వతీదేవి కూడా ఈ తీర్థంలో స్నానమాచరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
 
అంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ తీర్థంలో ప్రతి సంవత్సరం మాఘమాసంలో సూర్యుడు కుంభరాశిలో సంచరిస్తున్న సమయంలో మాఘా నక్షత్రంతో కూడిన పున్నమినాడు మధ్యాహ్నంపూట స్నానమాచరిస్తే పన్నెండు సంవత్సరాల పాటు గంగానదిలో స్నానమాచరించిన దానితో సమానమని పురాణాలు చెబుతున్నాయి.  ఇంద్రియ నిగ్రహన్ని పాటిస్తూ ప్రతిరోజు మూడువేళలా కుమారతీర్థంలో స్నానం చేయాలి. అలా మూడు నెలల పాటు క్రమం తప్పకుండా ఈ తీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో వారికి వృద్థాప్యం తొలగుతుంది. 
 
అంతేకాదు శరీరం వజ్ర పటుత్వం కూడా వస్తుంది. సర్వపాపాలు తొలగిపోతాయి. సర్వసంపదలతో పాటుగా సుఖాలు కలుగుతాయి. చిట్టచివరకు ముక్తి కూడా లభిస్తుంది. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన కుమార తీర్థం లాంటి తీర్థాలు ఎన్నెన్నో ఉన్నాయి. అందుకే భక్తులందరూ తిరుమలకు వచ్చినపుడు పుణ్నస్నానాలు ఆచరించి మరీ స్వామివారిని దర్శించుకుంటుంటారు.