గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By JSK
Last Modified: మంగళవారం, 8 నవంబరు 2016 (16:54 IST)

శివ‌కేశ‌వుల‌ను ఎంత పూజిస్తే అంత ధ‌నం... కార్తీక పురాణ సారంశం....

ఈ కార్తీక మాసంలో శివ‌కేశ‌వుల‌ను ఎంత పూజిస్తే, అంత ధ‌నం... కార్తీక పురాణంలో వశిష్టుల‌ వారు జనకునికి ఈ విష‌యాన్నే బోధించారు. రాజా! కార్తీకమాసం గురించి, దాని మహత్మ్యం గురించి ఎంత విన్నా తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజి౦చిన వా

ఈ కార్తీక మాసంలో శివ‌కేశ‌వుల‌ను ఎంత పూజిస్తే, అంత ధ‌నం... కార్తీక పురాణంలో వశిష్టుల‌ వారు జనకునికి ఈ విష‌యాన్నే బోధించారు. రాజా! కార్తీకమాసం గురించి, దాని మహత్మ్యం గురించి ఎంత విన్నా తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజి౦చిన వారి ఇంట లక్ష్మిదేవి స్థిరముగా ఉంటుంది. తులసీ దళములతోగాని, బిల్వ పత్రములతోగాని సహస్ర నామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమందు ఉసిరిచెట్టు కింద సాలగ్రామముంచి భక్తితో పూజి౦చిన వారికి కలుగు మోక్షమింతింతగాదు. బ్రాహ్మణులకు కూడా ఉసిరిచెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన, సర్వపాపములు పోవును. 
 
ఈ విధంగా కార్తీకస్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్లి భక్తితో సాష్టా౦గ నమస్కారాలైనా చేస్తే చాలు వారి పాపములు నశించును. స్థోమ‌త ఉన్నవారు శివకేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన, హోమాదులు, దానధర్మములు చేస్తే, అశ్వమేధం చేసినంత ఫలం దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకు౦ఠప్రాప్తి కలుగుతుంది. శివాలయమునగాని, విష్ణ్వాలయమున గాని జండా ప్రతిష్టించినచో యమకింకరులు సైతం దగ్గరకు రాలేరు సరి కదా, పెనుగాలికి ధూళి రాసులెగిరిపోయినట్లే కోటి పాపములైనా పటాప౦చలై పోతాయి. 
 
ఈ కార్తీక మాసంలో తులసికోట వద్ద ఆవుపేడతో అలికి వరి పిండితో శంఖుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యం పోసి దానిపై ప్రమిద నుంచి నిండా నువ్వులు నూనె పోసి, వత్తిని వేసి వెలిగించాలి. ఈ దీపం రాత్రింబవళ్లు ఆరకుండా ఉండాలి. దీనినే నందా దీపమంటారు. ఈ విధంగా జేసి, నైవేద్యము అర్పించి కార్తీక పురాణం చదివితే హరిహరులు సంతసించి కైవల్యం అందిస్తారు. 
 
కార్తీకమాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్ వృద్ది కలుగును. సాలగ్రామమునకు ప్రతి నిత్యం గంధం పట్టించి తులసీ దళాలతో పూజించవలెను. ఏ మనుజుడు ధనం బలం కలిగి కార్తీక మాసమందు పూజాదులు సలపడో అ మానవుడు మరు జన్మలో శునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కార్తీక మాసం నెల రోజులూ పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనా చేసి శివకేశవులను పూజించినా మాస ఫలం కలుగుతుంది. 
 
నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం
నాగేంద్రకన్యా వృష కేతనాభ్యం నమో నమ శ్శంకర పార్వతీభ్యాం