హనుమంతుడిని రాముడు పంపాడా.. రావణుడే ఇలా వేషం మార్చుకుని కూర్చున్నాడా?!

సీతతో ఎట్లు సంభాషణము చేయవలెనా అని హనుమంతుడు ఆలోచించుట!

దీవి రామాచార్యులు (రాంబాబు)| Last Updated: బుధవారం, 30 మార్చి 2016 (16:23 IST)
పరాక్రమశాలియైన హనుమంతుడు సీత మాటలను, త్రిజట స్వప్న వృత్తాంతమును, రాక్షసస్త్రీలు భయపెట్టుచు పలికిన మాటలను సర్వమును యథాతథముగా వినెను. పిమ్మట అతడు నందనవనములో ఉన్న దేవతాస్త్రీ వలె ఉన్న ఆ సీతాదేవిని చూచుచు, అనేక విధముల ఆలోచించెను.

''ఎన్నో వేలకొలది, అయుతముల కొలది (పదివేలు= అయుతము) వానరులు సకలదిక్కులందు ఏ సీతకై వెదకుచున్నారో ఆమెను నేను చూడగలిగినాను. నేను శత్రుబలమును దృష్టిలో ఉంచుకొని అతి జాగరూకతతో, గూఢముగా, గూఢచారివలె సంచరించుచు ఈ విషయములన్నీ తెలుసుకొన్నాను. రాక్షసుల విశేషమును, ఈ పురమును, రాక్షసాధిపతియైన రావణుని ప్రభావమును చూసినాను.

సకల ప్రాణులందు దయ గల, ఊహింపశక్యము కాని ప్రభావము గల రాముని భార్య పతి దర్శనమునకై తల్లడిల్లుచున్నది. ఈమెను ఓదార్చుట యుక్తము. కాని ఇప్పుడు ''సీతను ఎలా కాపాడాలి నేను రాముడు పంపగా వచ్చిన హనుమంతుడని ఎలా తెలిపాలి'' అని ఆలోచించాడు. వెంటనే రామనామ సంకీర్తనలు మొదలుపెట్టాడు. ''రామ'' అన్న మాట వినగానే సీత ఒక్కసారి తలపైకెత్తి చూసినది.

ఒక కొమ్మపైన ఒక చిన్న కోతి కూర్చుని రామనామ స్మరణ చేస్తున్నది. సీతకు అనుమానం కలిగింది. ఇది కూడా ఆ రావణమాయ అని అనుకున్నది. అప్పుడు హనుమంతుడు చెట్టుకొమ్మపై నుండి క్రిందకు దిగి చేతులు జోడించి సీతకు నమస్కారము చేసి,

''నీ దైన్యమును, మనుష్యులలో ఎవ్వరియందు కనబడని సౌందర్యమును, తపస్సును సూచించు వేషమును చూడగా నీవు రాముని భార్య అయిన సీత అని స్పష్టముగా తెలియుచున్నది'' అన్నాడు. (V.33,13) సీత హనుమంతునితో తన వృత్తాంతమంతయు చెప్పెను. చివరగా ''రావణుడు నాకు రెండు మాసములపాటు జీవితమును అనుగ్రహించినాడు. రెండు మాసముల తర్వాత నేను ప్రాణములను వదలగలను'' అని చెప్పెను. అన్ని విషయములు చెప్పిన పిమ్మట సీతకు హనుమంతునిపై అనుమానము వచ్చెను.

అసలు ఇతను నిజంగానే రాముడు పంపగా వచ్చాడా లేక రావణుడే ఇలా వేషం మార్చుకుని వచ్చాడా అని అనుమానిస్తూ హనుమంతునితో సీత ''నీవు రాముని దూతగా వచ్చినవాడవే అయితే నీకు మంచి జరుగుగాక. ఓ వానరశ్రేష్ఠా! నాకు రామకథ చాలా ఇష్టము.

అందుకే నిన్ను అడుగుచున్నాను. నాకు రాముని గుణములను వర్ణించి చెప్పుము''. అనెను.
(V.34.18-19) అప్పుడు హనుమంతుడు సీతతో '' ఓ విశాలాక్షీ! నేను గుర్తించిన రాముని లక్షణములను, లక్ష్మణుని లక్షణములను చెప్పెదను వినుము'' అంటూ చెప్పసాగాడు. - ఇంకా వుంది.. దీవి రామాచార్యులు (రాంబాబు).దీనిపై మరింత చదవండి :