తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం : హాజరైన గవర్నర్ నరసింహన్
తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఏప్రిల్ 8వ తేదీన ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఆగమమోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ప్రతి యేడాది నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని తితిదే నిర్వహిస్తూ వస్తోంది.
ఉగాదితో పాటు ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. సుగంధ, పరిమళ ద్రవ్యాలతో శ్రీవారి ఆలయాన్ని తితిదే అధికారులు శుద్ధి చేస్తారు.
మంగళవారం జరిగిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అష్టదళ పాదపద్మారాధన సేవను తితిదే రద్దు చేసింది. శుద్ధి అనంతరం 11 గంటలకు భక్తులను టిటిడి దర్శనానికి అనుమతించింది.
