తిరుమల దర్శనం 2 గంటల్లోనే.. శ్రీవారి సేవలో ప్రముఖులు
గత పది రోజులుగా భక్తులతో కిటకిటలాడిన తిరుమల ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తోంది. సర్వదర్శనం కేవలం 2 గంటల్లోనే భక్తులకు లభిస్తోంది. శని, ఆది, సోమవారాలలో రద్దీ మోస్తారుగా కనిపించినా మంగళవారం ఉదయానికి ఖాళీ అయిపోయింది. మంగళవారం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి స్వామి దర్శనం 2 గంటల్లోనే లభిస్తోంది. అలాగే కాలినడక భక్తులు 3 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి కూడా రెండుగంటల్లోనే శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
పాఠశాలలు తిరిగి పునఃప్రారంభం కావడంతో భక్తుల రద్దీ తగ్గినట్లు తితిదే అధికారులు చెపుతున్నారు. రేపటికి తిరుమలలో భక్తుల రద్దీ మరింత తగ్గే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. సోమవారం శ్రీవారిని 82,347 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 3 కోట్ల 32 లక్షల రూపాయలు వసూలైంది.
మరోవైపు.. మంగళవారం శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపి రాయపాటితో పాటు తెలంగాణ ప్రాంతానికి శాసనసభ్యురాలు కొండా సురేఖలు విఐపి విరామ దర్శన సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని రంగనాయకమండపంలో ప్రముఖులకు తితిదే అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.