సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : సోమవారం, 9 మే 2016 (11:12 IST)

మే 11న కోదండరామాలయంలో పుష్పయాగం

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మే 11వ తేదీన పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరుగనుంది. మే 10వ తేదీ సాయంత్రం అంకురార్పణను తితిదే నిర్వహించుంది. పుష్పయాగం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలు రకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేస్తారు. 
 
అనంతరం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామి వారు ఆలయ నాలుగు మాడా వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆస్థానాన్ని కూడా తితిదే నిర్వహించనుంది. కోదండ రామస్వామి ఆలయంలో ఏప్రిల్‌ 4 నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాల్లోగానీ, నిత్యకైంకర్యాలల్లోగానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార, అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీతెలియక ఏవైనా లోపాలు జరిగే ఉంటే వాటికి ప్రాయశ్చితంగా పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకుల నమ్మకం.