హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన శ్రీవారి లడ్డూలు
తిరుమల తిరుపతి దేవస్ధానం (తితిదే) శ్రీవారి లడ్డూల విక్రయాన్ని ప్రారంభించింది. ఈ లడ్డూలు హాట్ కేకుల్లో అమ్ముడు పోయాయి. కేవలం 3 గంటల్లోనే ఏకంగా 2.4 లక్షల లడ్డూలు అమ్ముడుపోయినట్టు తితిదే అధికారులు వెల్లడించారు.
కరోనా వైరస్‌తోపాటు.. లాక్డౌన్ కారణంగా భక్తులకు శ్రీవారి దర్శనంతో పాటు... శ్రీవారి ప్రసాదాలను నిలిపివేశారు. అయితే, కేంద్రం ఇటీవల లాక్డౌన్ ఆంక్షలను సడలించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీవారి లడ్డూల విక్రయం చేపట్టింది. ఇందులోభాగంగా, సోమవారం లడ్డూల విక్రయం ప్రారంభంకాగా, కేవలం 3 గంటల్లోనే 2.4 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయి.
ఒక్క గుంటూరు మినహా 12 జిల్లాల్లో లడ్డూ ప్రసాదాలు విక్రయించారు. గుంటూరులో టీటీడీ కల్యాణమండపం రెడ్ జోన్‌లో ఉన్నందున అక్కడ అమ్మకాలు చేపట్టలేదు. గుంటూరులో ఈ నెల 30 నుంచి లడ్డూ ప్రసాదాలు విక్రయిస్తారు.
మంగళవారం మరో 2 లక్షల లడ్డూలు జిల్లా కేంద్రాలకు తరలించనున్నారు. కాగా, లడ్డూలు విక్రయించాలని తెలంగాణ, తమిళనాడు భక్తుల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి. దాంతో, తమిళనాడుకు లక్ష, తెలంగాణకు 50 వేల లడ్డూలు పంపాలన్న యోచనలో తితిదే అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. గత 60 రోజులుగా శ్రీవారి ప్రసాదం లేకపోవడంతో చాలా మంది భక్తులు ఈ లడ్డూల కోసం పోటీపడ్డారు.