తిరుమల అన్నదాన ట్రస్టుకు సంవత్సరానికి రూ.వంద కోట్ల విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో అత్యద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమలలో టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నదాన ట్రస్టుకు ఒక సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు విరాళం రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత సంవత్సరం 2015 మార్చి 15వ తేదీ నుంచి ఈ సంవత్సరం 2016 మార్చి 15వ తేదీ వరకు తితిదే అన్నదాన ట్రస్టుకు పలువురు దాతలు 100 కోట్ల రూపాయలు విరాళంగా అందజేశారు.
ఇన్ని సంవత్సరాల తితిదే చరిత్రలో అరుదైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు 50 నుంచి 60 వేల మంది భక్తులతో కిటకిటలాడే తిరుమలలో 20 వేల మందికిపైగా సాధారణ భక్తులు తితిదే ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత అన్నప్రసాదాన్నే భుజిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఎంత మంది భక్తులు వచ్చినా వారికి కడుపునిండా భోజనాన్ని పెట్టి పంపుతుంది తితిదే. టిటిడికి సంబంధించిన వాటిలో తరిగొండ వెంగమాంబ అన్నదాన సముదాయం అతి పెద్దది. ఇక్కడే 15 వేల మందికిపైగా భక్తులు భోజనం చేయగా మిగిలిన చిన్నచిన్న అన్నదాన సముదాయాల్లో భక్తులు భోజనం చేస్తుంటారు.
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు. ఒక అన్నం మెతుకు కిందపడినా ఒప్పుకోరు. ఎందుకుంటే అన్నం పరబ్రహ్మంతో సమానమని, అన్నంను వృథా చేయకూడదని చెబుతుంటారు. అలాంటిది ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే వేలాది మంది భక్తుల ఆకలిని తీర్చేందుకు అన్నదాన ట్రస్టును తితిదే నడుపుతోంది. ఒక్క రూపాయి కూడా భక్తుల నుంచి తీసుకోకుండా ఉచితంగా ఎంత భుజిస్తే అంత భోజనాన్ని టిటిడి అందిస్తూ వస్తోంది.
అన్నదాన ట్రస్టు ప్రారంభమైనప్పటి నుంచి ఎంతోమంది దాతలు ఆ ట్రస్టుకు విరాళాలు ఇస్తూ వచ్చారు. అయితే ఇంత మొత్తంలో విరాళాలు ఇవ్వడం మాత్రం తితిదే చరిత్రలోనే ఇదే మొదటిదని చెప్పుకోవచ్చు. సంవత్సరంలోనే 100 కోట్ల రూపాయలు విరాళం రావడంపై భక్తులతో పాటు టిటిడి అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు మీడియాకు తెలిపారు.
