1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Women's Constable duty on tirumala hills

తిరుమలలో మహిళా కానిస్టేబుళ్ళ చేతుల్లో శ్రీవారి ప్రసాదం సంచులే సంచులు... ఏంటి గోవిందా...?!!

Women's Constable
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మహిళా కానిస్టేబుళ్ళ దందా మితిమీరిపోతుందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తామేమీ తక్కువ తినలేదన్నట్లు తిరుమలలో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వామివారి ప్రసాదాల నుంచి సేవా టికెట్లను అధిక రేట్లకు విక్రయిస్తూ వేలకు వేలు సంపాదిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తిరుమలలో పనిచేసే మహిళా కానిస్టేబుళ్ళు ప్రతిరోజు విధి నిర్వహణ కోసం ఈ ప్రాంతానికి వస్తుంటారు. విధి విషయం పక్కనబెడితే సేవా టికెట్లను ఏ విధంగా విక్రయించాలో ప్రసాదాలను ఏ విధంగా అమ్మాలో అన్న విషయంపైనే వీరు ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు భక్తులు చెబుతున్నారు. 
 
శ్రీవారి ఆలయంలో పనిచేసే మహిళా కానిస్టేబుళ్ళయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదనే వాదనలు వినబడుతున్నాయి. 8 గంటలపాటు ఆలయంలో విధులు నిర్వహిస్తుంటారు కాబట్టి తితిదే పేష్కార్‌, ఆలయ డిప్యూటీ ఈవోల వద్ద సంతకాలు చేసుకుని ప్రసాదాలను సంపాదిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆలయం లోపలే వగపడి (శ్రీవారి ప్రసాదాలు ఇచ్చే స్థలం) ఉండటంతో మహిళా కానిస్టేబుళ్ళకు మరింత ఈజీగా మారిందని అంటున్నారు. 
 
స్లిప్పులను పర్సుల్లో పెట్టుకుని డ్యూటీ అయిపోయిందే తడవుగా బ్యాగులకు బ్యాగులు ప్రసాదాలు మోసుకుని ఆలయం బయటకు వస్తుండటాన్ని చూసి భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. మరికొంతమంది మహిళా కానిస్టేబుళ్ళయితే డ్యూటీని పక్కనబెట్టి ప్రసాదాలే పరమావధిగా అమ్ముకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. మహిళా కానిస్టేబుళ్ళు పెద్దమొత్తంలో ప్రసాదాలు బయటకు తీసుకురావడం చూసిన భక్తులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
 
శ్రీవారి ఆలయంలో మహిళా భక్తుల భద్రత కోసం మహిళా పోలీసులను నియమిస్తే ఆ విషయాన్ని మరిచిపోయి ప్రసాదాలను విక్రయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సేవా టికెట్ల వ్యవహారంలో కూడా కొంతమంది మహిళా కానిస్టేబుళ్ళు ఉన్నారని సమాచారం. ఎక్కువ రేట్లకు సేవా టికెట్లను డబ్బులను సంపాందించుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. 
 
ఇప్పటికే తిరుమలకు ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో మహిళా కానిస్టేబుళ్ల తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రసాదాలు, సేవా టికెట్లపై దృష్టి పెట్టే మహిళా కానిస్టేబుళ్లు భద్రతను గాలికొదిలేసినట్టేననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.మరి దీనిపై పోలీస్‌ బాస్‌ ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే. 
About Writer
ttdj