2009 మహిళామణులదే
మహిళలకు జేజేలు పలికిన ప్రపంచం
2009
సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యంతో అతలాకుతలమైపోయింది. అదే విధంగా మన దేశంలోను రాజకీయంగా, ఆర్థికంగా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. అదే దేశీయ మహిళలు తమ తమ కార్యరంగాలలో ప్రపంచంలోనే అగ్రగాములుగా నిలిచారనడంలో సందేహం లేదు. వారు తమ కలలను సాకారం చేసుకున్నారనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుత ఏడాది భారతీయ మహిళామణులు ప్రపంచంలోనే చరిత్ర సృష్టించారు. అది వారి దృఢసంకల్పం, అభిలాష, గెలవాలనే కోరికతో తమ కలలను పండించుకున్నారు. దీంతో కేవలం మన దేశమే కాదు ప్రపంచం సైతం తలవంచి సలాములు చేసిందనడంలో ఆశ్చర్యం లేదు.ప్రతిభా పాటిల్ సుఖోయ్ ప్రయాణం: భారతదేశపు తొలి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అత్యున్నత పదవిలో కొనసాగుతున్న మహిళగా గతంలోనే గుర్తింపు పొందారు. మహిళలు మగవారితో సమానంగానే అన్ని రంగాలలో రాణించాలనే ఆలోచనతోనే ఆమె ఈ ఏడాది చివరిలో తన 74వ ఏట యువకుల్లాగా అత్యంత ఉత్సాహం కనబరుస్తూ దేశీయ యుద్ధ విమానమైన సుఖోయ్‌లో ప్రయాణించిన మహిళగా చరిత్ర సృష్టించారు. ప్రతిభా పాటిల్ కనబరచిన సాహసోపేతమైన నిర్ణయం, ఆమెలోనున్న ధైర్యాన్ని దేశప్రజలే కాకుండా ప్రపంచమంతా మెచ్చుకున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా సుష్మాస్వరాజ్ :
మహిళ అంటే భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా కట్టు, బొట్టుతో ఎప్పుడూ బనారసీ చీరలో దర్శనమిచ్చే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకురాలు సుష్మాస్వరాజ్. ఆమె తన రాజకీయ జీవితంతోపాటు పార్టీలోను ఇప్పటి వరకు ఎలాంటి మచ్చ లేని నాయకురాలిగా ఎదగడం గర్వించదగ్గ విషయం. ఈ సంవత్సరం చివరన పార్టీ శ్రేయస్సు కోసం లాల్ కృష్ణ అద్వానీ తర్వాత ఆమె లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకోబడ్డారు. ఈ పదవికి వన్నె తెస్తారని ఆమె అనుయాయులతోపాటు పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ రారాణి మాయావతి :సాధారణమైన దళిత కుటుంబంలో పుట్టి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మాయావతి రాజకీయాలలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈమె తన రాజకీయ చతురతతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దళిత ఓటు బ్యాంకును తన ఖాతాలో జమచేసుకోవడంలో సఫలీకృతమైందనడంలో అతిశయోక్తి లేదు. ఆమె పట్టుదల, కృషి, రాజకీయ చతురత, దళితులపట్ల ఆమె చూపుతున్న ఆదరణ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని న్యూస్ వీక్ మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళామణులలో మాయావతికి ఎనిమిదవ స్థానం వచ్చినట్లు ప్రకటించడం గమనార్హం.
సూపర్ ఉమెన్ ఇందిరా నూయీ : సూపర్ ఉమెన్‌గా ప్రసిద్ధి చెందిన ఇందిరా నూయీ(53) నేడు ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన మహిళామణుల జాబితాలో 4వ స్థానాన్ని పొందారు. దీంతోపాటు పెప్సికో సంస్థకు ప్రధాన కార్యనిర్వహణాధికారి(సీఈఓ)గా ఇందిరా నూయీ తన కంపెనీని ముందుకు నడుపుతున్నారు. దీంతో ఆమెకు " బెస్ట్ లీడర్ షిప్ అవార్డు "తో సన్మానించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా అమెరికాలో అన్నపానీయాల ధరలు అధికమవడంతో ఆమె తీసుకున్న నిర్ణయాలతో తన కంపెనీకి చెందిన ఆర్థిక పరిపుష్టికి ఏమాత్రం దెబ్బ తగలలేదు. విదేశాలలోను ఈ ఏడాది మహిళలదే హవా నడిచింది :ఏంజెలా మార్కేల్ :జర్మనీకి చెందిన ఛాన్సలర్ ఏంజెలా మార్కేల్ నేడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళగా ప్రథమ స్థానంలో నిలిచారు. 55 సంవత్సరాల ఏంజెలా వరుసగా నాలుగవ సంవత్సరం జర్మనీ ఛాన్సెలర్‌గా ఎన్నికయ్యారు. జర్మనీలోని ఆరోగ్యం, పన్ను విధింపు ప్రణాళికలలో మెరుగైన మార్పులు తీసుకురావడంతో ఫోర్బ్స్ పత్రిక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళగా ప్రథమ స్థానాన్ని కల్పించింది.
మిషేల్ ఒబామా : అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా సతీమణి మిషేల్ ఒబామా కూడా ఈ ఏడాది తరచూ వార్తల్లోని వ్యక్తిగా నిలిచారు. ఫోర్బ్స్ పత్రిక నిర్వహించిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళ జాబితాలో ఆమెకు 40వ స్థానం దక్కింది. మిషేల్ అతి తక్కువ సమయంలో తన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అప్పుడప్పుడు ఆమె ధరించే డ్రస్సు, మేకప్‌తో వార్తల్లోకి ఎక్కితే, మరోసారి తన ఫిట్‌నెస్ గురించి, వైట్‌హౌస్‌లో తనే ప్రత్యేకంగా వ్యవసాయ పర్యవేక్షణ చేయడం ఇలా తరచూ వార్తల్లోకి ఎక్కారు. ఇదిలావుండగా ఆమె సమాజసేవలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషిసల్పుతున్నారు. ఇలా చెపుతూ పోతే చాలామందే ఉన్నారు. కాని రాబోయే రోజులు మాత్రం మహిళామణులదేననడంలో సందేహం లేదు. వారి శక్తియుక్తుల ముందు పురుషులు కూడా సలామ్ చేయాల్సిందే. కుటుంబాన్ని నడిపే తీరు నుంచి దేశీయ భద్రత, ఆర్థిక వ్యవస్థను క్రమబద్దీకరించే బాధ్యతలు మహిళల చేతిలోవుందనడంలో అతిశయోక్తి కాదు. వచ్చే నూతన సంవత్సరంలో దేశంలోనే కాకుండా ప్రపంచంలోని మహిళలు మరింత ముందుకు దూసుకుపోతారని ఆశిస్తూ... మరింత మంది మహిళలు వివిధ రంగాలలో రాణించాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.