శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (13:07 IST)

కూకట్‌పల్లి మాధవరం బ్రదర్స్ : రాజకీయాల్లో కలిసైనా.. ప్రత్యర్థులైనా వారే

కూకట్‌పల్లి మాధవరం బ్రదర్స్. వరుసకు అన్నాదమ్ముళ్లు. కానీ, రాజకీయాల్లోకి వచ్చేసరికి వారంతా కరుడుగట్టిన ప్రత్యర్థులు. కూటమి తరపున పోటీ చేస్తే కలిసి మెలిసి.. పార్టీల తరపున పోటీ చేస్తే ప్రత్యర్థుల్లా వ్యవహరిస్తారు. అందుకే మాధవరం సోదరుల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది.
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ డిసెంబరు 7వ తేదీన జరుగనుంది. గ్రేటర్ హైరదాబాద్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో కూకట్‌పల్లి స్థానం ఒకటి. ఇక్కడ పోటీ అంటే ముగ్గురు మాధవరం బ్రదర్స్ మధ్యేవుంటుంది. అయితే, ఈ దఫా లెక్క తప్పింది. ఇద్దరు మాత్రమే బరిలోకి దిగుతున్నారు. మరొకరు మాత్రం మిన్నకుండిపోయారు. ఇంతకీ ఆ ముగ్గురు మాధవరం బ్రదర్స్ ఎవరో తెలుసా? మాధవరం కృష్ణారావు. మాధవరం కాంతారావు, మాధవరం సుదర్శన రావు. 
 
వీరిలో ప్రస్తుతం తెరాస అభ్యర్థిగా కృష్ణారావు కూకట్‌పల్లి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి కాంతారావు బరిలో ఉంటే సుదర్శనరావు మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. గత 2014 ఎన్నికల్లో కృష్ణారావు, కాంతారావులు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అపుడు కృష్ణారావు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగగా, కాంతారావు బీజేపీ నేతగా ఉన్నారు. ఫలితంగా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. 
 
ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న సుదర్శనరావు 2009 ఎన్నికల్లో తెరాస, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేశారు. అపుడు కాంతారావు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో సుదర్శనరావు, కృష్ణారావులు కలిసిమెలిసి ప్రచారం చేశారు. 
 
కానీ, ఇపుడు పరిస్థితి పూర్తి భిన్నం. తెరాస అభ్యర్థిగా కృష్ణారావు, బీజేపీ అభ్యర్థిగా కాంతారావులు పోటీలో ఉన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న సుదర్శన రావు కూకట్‌పల్లి స్థానం నుంచి అనూహ్యంగా టిక్కెట్ దక్కించుకుని పోటీ చేస్తున్న నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినికి మద్దతు ఇస్తున్నారు. ఇలా కూకట్‌పల్లి రాజకీయాల్లో కలిసైనా, ప్రత్యర్థులుగానైనా మాధవరం సోదరుల మధ్యే పోటీ జరగాల్సిందే.