1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (09:05 IST)

రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ కావాలంటే? అర్హతలు ఇవే...

gas cylinder
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండు గ్యారెంటీల అమలుకు మంగళవారం నుంచి శ్రీకారం చుట్టింది. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే, ఈ రెండు పథకాలు వర్తించాలంటే తెలంగాణ ప్రభుత్వం కొన్ని షరతులతో పాటు అర్హతలును విధించింది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ రెండు పథకాలకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను పరిశీలిస్తే, 
 
గృహజ్యోతి పథకానికి అర్హతలు (200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం)
ప్రతి ఇంటికి ఒక విద్యుత్ కనెక్షన్‌కు మాత్రమే వర్తిస్తుంది. ప్రజాపాలన లేదా ఇతర అధికారక మార్గాల ద్వారా స్వీకరించిన దరఖాస్తుల్లో ఆధార్‌తో అనుసంధానమైన తెల్ల రేషన్ కార్డు, గృహ విద్యుత్ కనెక్షన్ నెంబర్ ఉన్న వాటికి పథకం వర్తిస్తుంది. అర్హులైన ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు జీరో బిల్లును అందించాలి. జీరో బిల్లు కోసం డిస్కంలు ఇపుడున్న పేర్లతోనే బిల్లులు మంజూరు చేయాలి. జీరో బిల్లులను ప్రభుత్వానికి పంపిస్తే డిస్కంలకు ప్రతి నెల 20వ తేదీ నాటికి ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. గృహజ్యోతి పథకం కనెక్షన్‌ను వ్యాపార అవసరాల కోసం విక్రయిస్తే చట్టపరమై చర్యలు తీసుకుంటారు. అర్హతలు ఉండీ ఈ పథకం కింద జీరో బిల్లు రాకపోతే సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో లేదా సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలి. రేషన్ కార్డు, విద్యుత్ కనెక్షన్‌కు సంబంధించిన యూఎస్సీ వివరాలతో ప్రజా పాలన పోర్టల్ ద్వారా మరోమారు దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారుల నుంచి రశీదు తీసుకోవాలి. పరిశీలన అనంతరం అర్హులని తేలితో ఆ మరుసటి రోజు నుంచి జీరో బిల్లులు మంజూరు చేస్తారు. 
 
రూ.500కే వంట గ్యాస్ పథకం 
ప్రజాపాలనలో సబ్సీడీ గ్యాస్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి రూ.500కే గ్యాస్ ఇస్తారు. దరఖాస్తులు తెల్ల రేషన్ కార్డును కలిగివుండాలి. దరఖాస్తుదారుని పేరుపై యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ ఉండాలి. వినియోగదారుడు గత మూడేళ్ళుగా వినియోగించిన లేదా బుక్ చేసిన సిలిండర్ల సంఖ్యను ఆధారంగా చేసుకుని సగటున లెక్కించి పరిమితి సంఖ్యలో రూ.500కే గ్యాస్ ఇస్తారు. గ్యాస్ బుక్ చేసుకుని తీసుకునే సమయంలో మొత్తం డబ్బులు చెల్లించాలి. ఆ తర్వాత ఈ సబ్సీడీ మొత్తాన్ని ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు అందిస్తే, గ్యాస్ కంపెనీలు వినియోగదారులకు డీబీటీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.