అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!
హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్న అందాల పోటీలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ పోటీలను ఆపేసి.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. ఇదే అంశంపై ఆయన అసెంబ్లీ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కుతోందని ఆరోపించారు.
విద్య కోసం బడ్జెట్‌లో 15 శాతం కేటాయిస్తామని చెప్పారని, కానీ, ఏడున్నర శాతం మాత్రమే ప్రకటించారని గుర్తుచేశారు. విద్యా భరోసా కార్డులు చెప్పారని, పిల్లల ఫీజులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పారని కానీ, ఏదీ నెరవేరలేదని విమర్శించారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు విషాహారంతో బాధపడుతున్నారని విమర్శించారు.
తాము ఫీజు రీయింబర్స్‌మెంట్స్ చెల్లించామని, మరో రూ.8 వేల కోట్లు ఉన్నాయని వాటిని చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అందాల పోటీల కోసం ఖర్చు పెట్టే బదులు విద్యార్థుల స్కూటీల కోసం ఖర్చుపెట్టాలని సూచించారు. రూ.500 కోట్లతో కొందరికైనా స్కూటీలు వస్తాయని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 2 లక్షల ఉద్యోగాల గురించి చెప్పారని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 11 వేల ఉద్యోగాలు మాత్రమేనని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిందని, గ్రూపు-2 ఉద్యోగ పోస్టులు పెంచుతామని చెప్పి పెంచలేని విమర్శించారు.