Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి
హైదరాబాద్‌లో ఆషాఢ బోనాలు చివరి అంకానికి చేరాయి. భాగ్యనగరం బోనమెత్తింది. అమ్మల కన్నా మాయమ్మ సల్లంగా సూడమ్మ అంటూ భక్తులు లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వర్షాలు కురవాలని పిల్లాపాపలు, పాడి, పంటలు బాగుండాలని వేడుకుంటున్నారు. బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల బోనాలు, శివసత్తుల ఆటలు, పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి బోనాల కోసం పోలీసులు భారీ భద్రత నిర్వహిస్తున్నారు.
లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, ఆలయ కమిటీ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం నాలుగు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఇందులో బోనాలు సమర్పించే వారి కోసం ఒక ప్రత్యేక క్యూలైన్ అందుబాటులో ఉంది. ఆదివారం తెల్లవారుజామున కుమ్మరిబోనం సమర్పించడంతో ప్రారంభమైన బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.