సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2024 (15:50 IST)

కాళ్లపారాణి ఆరకముందే.. తనువు చాలించిన నవ వధువు!!

తెలంగాణ రాష్ట్రంలోని నెన్నెల మండలంలో ఓ విషాదకర ఘటన జరిగింది. కాళ్ళపారాణి ఆరకముందే నవ వధువు తనువు చాలించింది. విద్యుదాఘాతం రూరంలో ఆమెను మృత్యువు కబళించగా, ఆమె కుటుంబ సభ్యులు, భర్త కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. నెన్నెలకు చెందిన జంబి స్వప్న (22) అదే గ్రామానికి చెందిన పల్లె సిద్ధు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఈ నెల 4న వివాహం చేసుకున్నారు. అత్తగారింటికి వెళ్లిన స్వప్న ఆదివారం ఉదయం స్నానం చేయడానికి వాటర్ హీటర్ వాడారు. ఆ సమయంలో భర్త సిద్ధు బయటకు వెళ్లారు. 
 
ఈ క్రమంలో విద్యుత్తు పలుమార్లు ట్రిప్ అయ్యింది. విద్యుత్తు సరఫరా లేదనుకున్న స్వప్న నీటిలో చెయ్యి పెట్టి హీటర్ తీశారు. దీంతో విద్యుదాఘాతానికి గురవ్వడంతో కుటుంబసభ్యులు నెన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. 
 
సిద్ధుకు తండ్రి లేరు. తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో యువతి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందనుకుంటే విద్యుత్తు ప్రమాదం విషాదాన్ని మిగిల్చిందని అతను రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.