గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 29 సెప్టెంబరు 2024 (11:40 IST)

నిర్వాసితుల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటాం.. దానకిషోర్ హామీ

moosi
హైడ్రా మూసీ ప్రాజెక్టుపై పరివాహాక ప్రాంతాల్లోని ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. నది పరీవాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలను కూల్చివేయాలని నిర్ణయించడం, ఆ ఇళ్లకు మార్కింగ్‌ చేస్తుండటంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 
 
మొన్నటి వర్షాలకు హైదరాబాద్ మునిగిపోయిందని, మూసీ ప్రక్షాళన అనేది సుందరీకరణ కోసం చేస్తున్న పనులు కాదనే విషయం అర్థం చేసుకోవాలని.. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ చెప్పారు. ఈస్ట్, వెస్ట్ కారిడార్ల నిర్మాణంతో ట్రాఫిక్ తగ్గుతుందని, మూసీ వెంట పార్కింగ్ సదుపాయాలు, పార్కులు నిర్మిస్తామన్నారు. 
 
మూసీలో ఉన్న నీటిని శుద్ధి చేసే ప్రాజెక్టును చేపట్టినట్టు దాన కిషోర్‌ తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులను 3800 కోట్లతో శుద్ధి చేయబోతున్నట్టు వివరించారు. మొత్తంగా మూసీ ప్రక్షాళనపై స్పష్టతనిచ్చిన జీహెచ్‌ఎంసీ… నిర్వాసితులకు ఎటువంటి ఆందోళన అవసరం లేదని భరోసానిస్తోంది. 
 
మూసీ వాసుల్ని ఉన్న పళంగా, దుర్మార్గంగా తరలించడం లేదని జీహెచ్ఎంసీ అంటోంది. ప్రతి కుటుంబం నుంచి అంగీకారం తీసుకున్న తర్వాతే తరలిస్తామని దానకిషోర్ అంటున్నారు. డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాకే తరలింపు ఉంటుందని, ఇప్పటివరకు 50 కుటుంబాల్ని ఒప్పించి సురక్షిత పునరావాసం కల్పించామని చెప్పారు. 
 
పాత ఇంటినుంచి పాతిక లక్షల విలువైన ఇళ్లలోకి వెళ్లే అవకాశం కల్పిస్తున్నామన్నారు.  నిర్వాసితుల్ని కన్నబిడ్డల్లా చూసుకునే బాధ్యతను తీసుకుంది జీహెచ్‌ఎంసీ అంటూ దానకిషోర్ వివరించారు.