1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 మే 2025 (14:23 IST)

ఆధునిక సాంకేతికతలతో ఈ-పాస్ పోస్టుల జారీ

Passport
గత యేడాది ఏప్రిల్లో ప్రవేశపెట్టిన పాస్ పోర్ట్ సేవా కార్యక్రమం (పీఎస్పీ) వర్షన్ 2.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతికతలతో కూడిన ఈ-పాస్ పోర్టుల జారీ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ-పాస్ పోర్టుల జారీని ప్రస్తుతం నాగ్‌పూర్, రాయపూర్, భువనేశ్వర్, గోవా, జమ్మూ, అమృత్‌సర్, సిమ్లా, జైపూర్, చెన్నై, సూరత్, హైదరాబాద్, రాంచీ నగరాల్లో పైలట్ విధానంలో చేస్తున్నారు.
 
త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. గత మార్చి నెలలో చెన్నైలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం వీటి జారీని ప్రారంభించింది. ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే ఈ ఏడాది మార్చి 22 నాటికి 20,729 ఈ-పాస్ పోర్టులు జారీ అయ్యాయి.
 
ఈ-పాస్‌పోర్టు ప్రత్యేకత ఏమిటంటే.. ఈ పాస్‌పోర్టు కవర్‌లో యాంటెన్నా, చిన్న రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఎస్ఐడీ) చిప్‌ను అనుసంధానం చేస్తారు. పాస్ పోర్టు హోల్డర్ బయోమెట్రిక్, వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేసే ఈ చిప్ ద్వారా మెరుగైన భద్రత, వేగవంతమైన వెరిఫికేషన్ లభిస్తుంది. ఈ పాస్‌పోర్టును దాని ముందు కవర్ కింద ముద్రించిన ప్రత్యేకమైన బంగారు రంగు చిహ్నం ద్వారా గుర్తించవచ్చు. 
 
చిప్‌లోని సున్నితమైన డేటా దుర్వినియోగం కాకుండా పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (పీకేఐ) ఎన్క్రిప్షన్ రక్షిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పాస్పోర్టులను ఈ-పాస్‌పోర్టులను మార్చుకోవాల్సిన అవసరం లేదు. అవి గడువు ముగిసే వరకూ చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ పాస్‌పోర్టుకు మారడం స్వచ్ఛందమే.