బుధవారం, 12 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (09:21 IST)

ఖమ్మం రైల్వే స్టేషన్‌లో ఇంటర్ లాకింగ్ పనులు... అనేక రైళ్లు రద్దు

train
ఖమ్మం రైల్వే స్టేషన్‌లో ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సుమారుగా 30 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రధానంగా కాజీపేట - డోర్నకల్, డోర్నకల్ - విజయవాడ, భద్రాచలం రోడ్డు - విజయవాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయగా, మరో 9 రైళ్ళను దారి మళ్ళించినట్టు పేర్కొంది.
 
గోల్కొండ, భాగ్యనగర్, శాతవాహన సహా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు 11 రోజుల పాటు అందుబాటులో ఉండవని తెలిపింది. సికింద్రాబాద్ - గుంటూరు ప్రాంతాల మధ్య నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు, సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్  ప్రాంతాల మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకు రద్దు చేశారు. 
 
అదేవిధంగా గుంటూరు - సికింద్రాబాద్ ప్రాంతాల మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును 10, 11, 15, 18, 19, 20 తేదీల్లో, విజయవాడ - సికింద్రాబాద్ మధ్య నడిచే శాతవాహన ఎక్స్‌ప్రెస్ 11, 14, 16, 18, 19, 20వ తేదీల్లో రద్దు చేశారు.
 
సికింద్రాబాద్ - విశాఖపట్టణం మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును 19, 20వ తేదీల్లో 75 నిమిషాలు, ఆదిలాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌‍ను 9, 11, 14, 19 తేదీల్లో నిర్ణీత సమయం కంటే 90 నిమిషాల పాటు ఆలస్యంగా బయలుదేరి వెళుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు.