సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2024 (12:28 IST)

జైనూర్‍‌లో ఆదివాసి యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. ఉద్రిక్తత!

victim girl
తెలంగాణ రాష్ట్రం, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జూనూర్‌లో ఒక ఆదివాసి యువతి అత్యాచారానికి గురైంది. ఆ యువతిపై ఆటో డ్రైవర్ లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ, జైనూర్ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్ ప్రశాంతంగా సాగుతున్న నేపథ్యంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు స్థానికులపై దాడులు చేశారు. దీంతో శాంతియుతంగా సాగుతున్న బంద్ కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. 
 
ఈ ఘటనలో దుకాణాలు తగులబెట్టారు. మంటలు చెలరేగి పొగ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువర్గాలను నిలిపివేసిన పోలీసులు, 144వ సెక్షన్ విధించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే ఆటో డ్రైవరైన నిందితుడు షేక్ మగ్దూంను అరెస్టు చేసిన పోలీసులు... బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆదివాసీలకు హామీ ఇచ్చారు. 
 
బాధితురాలికి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంత్రి సీతక్క బాధితురాలి వద్దకు వెళ్లి పరామర్శించారు. నిందితులు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని మంత్రి సీతక్క హెచ్చరించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి సీతక్క ఓ వీడియోను కూడా విడుదల చేశారు. దీంతో ఆదివాసీ సంఘాలు శాంతించాయి. 
 
కాగా, ఆగస్టు 31వ తేదీన సమీపంలోని గ్రామానికి వెళ్లేందుకు జైనూర్ బస్ స్టేషన్ వద్ద బాధిత ఆదివాసీ మహిళ నిలబడింది. ఆ తర్వాత ఆమె ఆటో రిక్షాను ఎక్కింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆటో డ్రైవర్ ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాధితురాలు అరిచే ప్రయత్నం చేసింది. దీంతో అతను ఆమె తలపై బలంగా కొట్టాడు. ఆమె పడిపోవడంతో... డ్రైవర్ భయపడి పారిపోయాడు. 
 
మహిళ పడిపోవడాన్ని కొంతమంది చూశారు. ఆమె ప్రమాదంలో గాయపడిందని భావించి ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సెప్టెంబరు 2వ తేదీన స్పృహలోకి వచ్చిన ఆమె జరిగిన విషయాన్ని చెప్పింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడు షేక్ మగ్దూంను అరెస్టు చేశారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు.