శుక్రవారం, 14 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2025 (17:24 IST)

కేక్ కట్ చేయాల్సిన 9 యేళ్ల బాలుడు తలకొరివి పెట్టడం కలచివేసింది...

telangana high court
బర్త్ డే రోజున తండ్రికి కొరివి పెట్టిన ఘటనపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక ఉద్వేగభరితంగా మాట్లాడారు. కేక్ కట్ చేయాల్సిన 9 యేళ్లబాలుడు తలకొరివి పెట్డం కలచివేసిందని ఆయన వ్యాఖ్యానించారు. అందువల్ల గ్రేటర్ హైదరాబాద్ నగరంలో లైసెన్స్ తీసుకున్న కేబుళ్లు మినహా ఏవీ ఉంచవద్దని న్యాయమూర్తి ఆదేశించారు.
 
హైదరాబాద్ నగరంలోని రామంతపూర్ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి కేబుల్ వేరు తగిలి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. దీంతో విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను యుద్ధప్రాతిపదికన తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక మరోమారు విచారణ జరిపింది. 
 
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామంతపూర్ ఘటనను ఆయన ప్రస్తావిస్తూ, బర్త్ డే రోజే తండ్రికి తలకొరివి పెట్టిన ఘటనపై ఉద్వేగభరితంగా మాట్లాడారు. కేక్ కట్ చేయాల్సిన 9 యేళ్ల బాలుడు తలకొరివి పెట్టడం కలచివేసిందని జస్టిస్ నగేశ్ భీమపాక అన్నారు. 
 
విద్యుత్ ప్రమాదంపై ఎవరికి వారే చేతులు దులిపేసుకుంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు బాధ్యులు ఎవరు? పసి హృదయం పగిలిపోయింది. దీనికి అందరం బాధ్యులమే. సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. చలన రహిత చట్టాలతో ప్రజల ప్రాణాలను ఎలా కాపాడగలం అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 
 
వైర్ల బరువుతో స్తంభాలు ఒరిగిపోతున్నాయన్న పిటిషనర్ల వాదనపై జస్టిస్ నగేశ్ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మామూళ్ల బరువుతో కొందరు ఉద్యోగుల జేబులు కూడా బరువెక్కుతున్నాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.