తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...
తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఎప్ సెట్) 2025 ఫలితాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం అధికారికంగా విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో ఈ ఏడాది బాలురు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. మొదటి పది ర్యాంకులనూ వారే కైవసం చేసుకోవడం విశేషం. అంతేకాకుండా, ఇంజినీరింగ్‌లో తొలి మూడు అత్యున్నత స్థానాలను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు దక్కించుకున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడకు చెందిన పల్లా భరత్ చంద్ర ప్రథమ ర్యాంకు సాధించగా, నంద్యాల జిల్లా కోనాపురం నివాసి ఉడగండ్ల రామ్ చరణ్ రెడ్డి ద్వితీయ ర్యాంకు, విజయనగరం జిల్లాకు చెందిన హేమసాయి సూర్యకార్తీక్ తృతీయ ర్యాంకును కైవసం చేసుకున్నారని అధికారులు తెలిపారు.
ఇక తెలంగాణ విద్యార్థుల్లో, హైదరాబాద్‌లోని నాచారానికి చెందిన మెండె లక్ష్మీభార్గవ్ నాలుగో ర్యాంకు సాధించారు. మాదాపూర్‌కు చెందిన మంత్రిరెడ్డి వెంకట గణేశ్ రాయల్ ఐదో ర్యాంకు, సుంకర సాయి రిశాంత్ రెడ్డి ఆరో ర్యాంకు, రష్మిత్ బండారి ఏడో ర్యాంకు పొందారు. బడంగ్ పేటకు చెందిన బనిబ్రత మాజీ ఎనిమిదో ర్యాంకు, హైదరాబాద్ వాసి కొత్త ధనుష్ రెడ్డి తొమ్మిదో ర్యాంకు, మేడ్చల్‌కు చెందిన కొమ్మ కార్తీక్ పదో ర్యాంకు సాధించినట్లు అధికారులు వివరించారు.
అగ్రికల్చర్, ఫార్మా విభాగంలోనూ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ విభాగంలో మేడ్చల్‌కు చెందిన సాకేత్ రెడ్డి మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నారు. కరీంనగర్‌కు చెందిన సబ్బాని లలిత్ వరేణ్య రెండో ర్యాంకు సాధించగా, వరంగల్‌కు చెందిన అక్షిత్ మూడో ర్యాంకు పొందారు. కొత్తకోట (వనపర్తి) వాసి సాయినాథ్ నాలుగో ర్యాంకు, మాదాపూర్కు చెందిన బ్రాహ్మణి ఐదో ర్యాంకు, కూకట్‌పల్లికి చెందిన గుమ్మడిదల తేజస్ ఆరో ర్యాంకు, నిజాంపేటకు చెందిన అఖిరానందన్ రెడ్డి ఏడో ర్యాంకు, సరూర్ నగర్ వాసి భానుప్రకాశ్ రెడ్డి ఎనిమిదో ర్యాంకు, హైదర్ గూడకు చెందిన శామ్యూల్ సాత్విక్ తొమ్మిదో ర్యాంకు, బాలాపూర్కు చెందిన అద్దుల శశికరణ్ రెడ్డి పదో ర్యాంకు సాధించినట్లు అధికారులు వెల్లడించారు.