కొండెక్కిన చికెన్ ధరలు - 20 రోజుల్లో రూ.100 పెరుగుదల
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొండెక్కాయి. గత 20 రోజుల వ్యవధిలో ఏకంగా రూ.100 మేరకు పెరిగాయి. మున్ముందు మరింతగా పెరిగే అవకాశం ఉన్నాయని చికెన్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
ఒక్క తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 10 లక్షల కేజీల చికెన్ విక్రయాలు జరుగుతుంటాయి. ఆదివారం లేదా పండుగ రోజుల్లో ఇది 15 లక్షల కేజీల వరకు ఉంటుంది. అయితే, ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది.
ఫలితంగా గత 20 రోజులుగా చికెన్ విక్రయాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రోజుకు 2 లక్షల కేజీల వరకు చికెన్ డిమాండ్ కూడా పెరిగింది. దీంతో పాటు కోళ్ళ కొరత ఏర్పడుతుంది. ఈ కారణాలన్నింటి కారణంగా చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
దీనికితోడు తెలుగు రాష్ట్రాల్లో సూర్యతాపం పెరిగింది. దీంతో ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా కోడి పిల్లలు మృత్యువాతపడుతున్నాయి. దీనికితోడు సోయాచెక్క, మొక్కజొన్న దాణా వంటి ధరలూ పెరిగిపోయాయి.
మరోవైపు నాటుకోడి ధర కేజీలో రూ.400 నుంచి రూ.500కు పెరిగింది. ప్రస్తుతం నాటుకోళ్ళ లభ్యత చాలా తక్కువగా ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది.