1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2016 (12:34 IST)

హైదరాబాద్ నగరంలో మహిళలకు రక్షణేది... ఒక్కరోజే పదకొండు ఘటనలు

హైదరాబాద్ నగరంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. చిన్నారులు, విద్యార్థులు, యువతులు, మహిళలు, వృద్ధులు ఇలా.. ఏ ఒక్కరికీ రక్షణ ఎండమావిగా మారిపోయింది. దీనికి ఉదాహరణే గురువారం ఒక్కరోజే ఏకంగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన 11 సంఘటనలు. హైదరాబాద్ నగరంలో కొత్తపేట, మోండ, అడ్డగుట్ట, మదీన, మల్కాజ్‌గిరి, అమీర్‌పేట, ఏఎస్ రావునగర్, హాసన్ నగర్ తదితర ప్రాంతాల్లో మహిళలపై ఈ అఘాయిత్యాలు చోటుచేసుకున్నాయి. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దూరపు బంధువు దాడి చేసి 3 తులాల బంగారు గాజులను లాక్కెళ్లాడు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన దినేష్‌రెడ్డి కుటుంబం నాగోల్‌ నర్సింహపురి కాలనీలో ఈ దాడి జరిగింది. అలాగే, అడ్డగుట్టలో ఓ కిరాణాదుకాణం నిర్వహిస్తున్న లక్ష్మీ అనే మహిళపై ఉదయం 6 గంటల సమయంలో వస్తువు కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి దుకాణానికి వచ్చి... ఆమె మెడలోని గొలుసును తెంపుకుని పారిపోయాడు. 
 
కేరళ రాష్ట్రానికి చెందిన విద్యార్థిని నగరంలోని హాస్టల్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. బాలానగర్‌లో ఉంటున్న పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. తన హ్యాండ్ బ్యాగును గదిలో పెట్టి స్నానానికి వెళ్లి వచ్చేలోపు అది మాయమైంది. దీంతో పక్కనే ఉన్న హాస్టల్‌ నిర్వాహకుడు నరేందర్‌ రెడ్డిని నిలదీసింది. బ్యాగులోని డబ్బు తీసి వేరేచోట భద్రపర్చానని అక్కడికి వస్తే ఇస్తానని చెప్పి ఓ పార్కుకు తీసుకెళ్ళి విద్యార్థి నోట్లో కుక్కి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
వరంగల్‌ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం పామునూరు గ్రామానికి చెందిన టి.శ్వేత (22) అనే మహిళ అదనపుకట్నం వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. మరో ప్రాంతంలో ఓ బాలికపై యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఇలాగే మరికొన్ని ప్రాంతాల్లో మరికొన్న ఘటనలు జరిగాయి. వీటిపై ఆయా ప్రాంతాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.