మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 మే 2021 (19:19 IST)

వరకట్న వేధింపులు... ప్రేమ పెళ్లి చేసుకున్నా వేధింపులు.. చివరికి?

వరకట్న వేధింపులు ఓ యువతి ప్రాణాలు తీసింది. పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి ఏడాది తిరక్కుండానే కన్ను మూసిన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. హుజూర్ నగర్, సుందరయ్య నగర్‌కు చెందిన ఆత్కూరి సుజాత రెండో కుమార్తె మౌనిక (19) అదే ప్రాంతానికి చెందిన పంగ నాగరాజు అనే యువకుడిని ప్రేమించి, పెద్దలను ఒప్పించి గతేడాది మే 14న పెళ్లి చేసుకుంది.
 
పెళ్లి సమయంలో వరకట్నం కింద 20 కుంటల భూమిని ఇచ్చేందుకు మౌనిక తల్లి సుజాత ఒప్పుకుంది. గత కొంతకాలంగా నాగరాజు మౌనికను వేధించటం మొదలెట్టాడు. పెళ్లి సమయంలో ఇస్తానన్న భూమిని తన పేరున రిజష్ట్రేషన్ చేయించుకు రమ్మనమని వేధించసాగాడు
 
భర్త వేధింపులు భరించలేని మౌనిక మే 1 శనివారం సాయంత్రం పురుగుల మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించింది. గమనించిన భర్త ఆమెను వెంటనే స్ధానిక ఆస్పత్రికి తరలించాడు. కానీ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.