యూట్యూబ్ డాక్టర్ : క్లినిక్‌లో చట్టవిరుద్ధంగా అబార్షన్లు
ఓ యువకుడు.. ఎలాంటి అర్హతలు లేకున్నా యూట్యూబ్ చూసి డాక్టరుగా అవతారమెత్తాడు. చట్ట విరుద్దంగా అబార్షన్లు చేయసాగాడు. గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న నకిలీ వైద్యుడి బాగోతం వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో బహిర్గతమైంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణా రాష్ట్రం వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావు పేటకు చెందిన అండ్రు ఇంద్రారెడ్డి. బీఎస్సీ చదివిన ఇంద్రారెడ్డి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేశాడు.
హన్మకొండలోని ఎకశిలా పార్క్ ఎదురుగా రెండు నెలల కిందట హాస్పిటల్ ఏర్పాటు చేశాడు. తనకు అర్హత లేకున్నా వైద్యుడి అవతారం ఎత్తాడు. ఇందులోభాగంగా హోటల్ నడిచే ఓ బిల్డింగ్‌ను అద్దెకు తీసుకుని సిటీ హాస్పిటల్ పేరుతో ఆస్పత్రిని, మెడికల్ షాపు ఏర్పాటు చేసి, జనానికి వైద్యం అందిస్తూ వచ్చాడు.
ఈ ఆస్పత్రిలో ఆర్థో సంబంధింత వైద్యం అందిస్తామని బ్యానర్ ఉన్నా.... లోపల చట్ట విరుద్దమైన అబార్షన్లు చేయసాగాడు. ఈ విషయం బయటకుపొక్కింది. ఇద్దురు ఆడపిల్లలు ఉన్న ఓ వివాహితకు అబార్షన్ చేసినట్లు వైద్యులకు సమాచారం అందింది. దీంతో వైద్యశాఖాధికారులు ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేశారు.
అధికారుల రాకను పసిగట్టిన నకిలీ వైద్యుడు గోడదూకిపారిపోయాడు. అధికారులు ఆస్పత్రితోపాటు.. మెడికల్ షాపును సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.