తెలంగాణ సచివాలయానికి వచ్చిన గవర్నర్.. స్వయంగా స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
తెలంగాణ నూతన సచివాలయ భవనానికి ఆ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ శుక్రవారం వచ్చారు. ఈ ఆలయంలో కొత్తగా నిర్మించిన ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుదైన సంఘటన చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా ఉప్పు, నిప్పుగా ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇందుకోసం ముందుగానే సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ తర్వాత వచ్చిన గవర్నర్ తమిళిసైకు సాదర స్వాగతం పలికారు. ఆమెతో కలిసి సీఎం కేసీఆర్ నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చర్చి, మసీదులను కూడా ప్రారంభించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తర్వాత గవర్నర్‌ను రాష్ట్ర ప్రభుత్వం తరపున సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
కొత్త సచివాలయం నిర్మించిన తర్వాత ఆ ప్రాంగణంలోకి గవర్నర్ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. సచివాలయ ప్రారంభోత్సవం సమయంలో తనకు ఆహ్వానం లభించలేదని గవర్నర్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, గురువారం రాత్రి మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం కోసం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్.. గవర్నర్‌తో 20 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగానే సచివాలయంలో ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవాలకు ఆహ్వానించగా గవర్నర్ పాత విషయాలను ఏమాత్రం మనసులో పెట్టుకోకుండా శుక్రవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు.