సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (09:35 IST)

హైదరాబాద్‌లో ఫ్యాన్సీ నంబర్ల కోసం కోటీశ్వరుల కొట్లాట..

సాధారణంగా రవాణా శాఖ ఫ్యాన్సీ నంబర్లను వేలం వేసి అదనపు ఆదాయాన్ని అర్జిస్తూ ఉంటుంది. ఈ ఆనవాయితీ ఎప్పటినుంచో వస్తోంది. ఈ ఫ్యాన్సీ నంబర్ల కోసం కోటీశ్వరులు పోటీపడుతుంటారు. ఇలాంటివారిలో హీరో జూనియర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. సోమవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్ల వేలం పాటలు జరిగాయి. 
 
ఈ పాటల్లో ఒకే నంబరు కోసం ఇద్దరు కోటీశ్వరులు పోటీపడ్డారు. ఈ నంబరు కోసం వారిద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితికి చేరింది. ఈ ఒక్క సంఘటనే ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న డిమాండ్‌ను రుజువు చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఖైరతాబాద్ సెంట్రలో జోన్ ఆర్టీఏ ఆఫీసులో సోమవారం నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా సంస్థకు ఒక్క రోజులోనే రూ.30,55,748 ఆదాయం వచ్చింది. 
 
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీఎస్ 09 ఎఫ్ఈ సిరీస్‌లో 9999 అనే ఫ్యాన్సీ నంబరు రూ.10 లక్షల ధర పలికింది. దీన్ని ఎన్ఎస్ఎల్ ప్రాపర్టీస్ సంస్థ కైవసం చేసుకుంది. పాత (టీఎస్ 09 ఎఫ్ఈ) సిరీస్ ముగిసి కొత్త సిరీస్ టీఎస్ 09 ఎఫ్ఎఫ్‌లోకి అడుగు పెట్టింది. అందులో ఒకటో నంబరు కోసం ఎఫ్ఆర్ఆర్ హిల్ హోటల్స్ సంస్థ రూ.6.95 లక్షలు చెల్లించగా, 99 నంబరును ఎమర్జిన్ అగ్రినోవా సంస్థ రూ.2.78 లక్షలు చెల్లించి దక్కించుకుంది. మంచి డిమాండ్ ఉండే 9వ నంబరు మాత్రం అధికారులు నిర్ణయించిన రూ.50 వేలకే అమ్ముడుపోయింది. 
 
ఇకపోతే, కొత్త సిరీస్‌లో 0001 నంబరు కోసం ఇద్దరు వ్యక్తులు పోటీపడ్డారు. ఈ నంబరు నాకు కావాలంటే నాకు కావాలంటూ ఇద్దరూ ఘర్షణకు దిగారు. దీంతో ఈ నంబరును లాటరీ ద్వారా అధికారులు కేటాయించనున్నారు. అంటే.. ఈ నంబరు కోసం ఆర్టీఏ అధికారులు నిర్ణయించిన ధరతో పాటు అదనంగా ఆ నంబరుకు వారు ఖర్చు చేయదలచుకున్నారో ఆ మొత్తాన్ని చెక్కుల రూపంలో టెండర్ బాక్సులో వేయాలి. ఇందులో ఎక్కువ మొత్తానికి కోట్ చేసిన వ్యక్తికి ఈ నంబరును కేటాయిస్తారు.