శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (09:23 IST)

పెళ్లి వద్దు సహజీవనం చేద్దామన్న మహిళ - వక్రబుద్ధిని చూపిన యువకుడు

kidnapers
హైదరాబాద్ నగరానికి చెందిన మహిళ కుమారుడిని ఓ యువకుడు కిడ్నాప్ చేశాడు. అప్పటికే సహజీవనం చేస్తున్న ఆ యువకుడు పెళ్లి చేసుకుందామని ఆ మహిళను కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. పెళ్లి వద్దు సహజీవనం చేస్తూ కలిసివుందామని సెలవిచ్చింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన యువకుడు ఆమె రెండేళ్ల కుమారుడిని కిడ్నాప్ చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అల్లాపూర్‌లోని పిలీదర్గా సమీపంలో నివసించే మహిళ (24)కు రషీద్‌ అనే వ్యక్తితో 2017లో వివాహమైంది. ఆమెకు నాలుగేళ్లు, రెండేళ్లు ఉన్న ఇద్దరు పిల్లలున్నారు. అయితే, భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా యేడాది క్రితం ఆమె భర్తకు విడాకులిచ్చింది. 
 
ఆ తర్వాత సమీపంలో నివసించే శంకర్‌(21)తో ఆమెకు పరిచయం ఏర్పడగా, మూడు నెలలుగా మోతీనగర్‌లోని బబ్బుగూడలో సహజీవనం చేస్తున్నారు. ఈనెల 14న పెళ్లి చేసుకుందామని శంకర్‌.. ఆమెతో గొడవకు దిగాడు. వద్దని ఆమె సహజీవనం చేద్దామని తేల్చిచెప్పింది. 
 
ఇందుకు నిరాకరించిన శంకర్‌.. తనతో ఉండాలంటే పిల్లల్ని తీసుకురావాలని తేల్చిచెప్పాడు. నిరాకరించడంతో అదేరోజు సాయంత్రం ఆమె స్నేహితురాలి ఇంట్లో ఉన్న మహిళ చిన్న కుమారుణ్ని తీసుకొని పరారయ్యాడు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు శంకర్ కోసం గాలిస్తున్నారు.