శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: గురువారం, 17 సెప్టెంబరు 2020 (18:03 IST)

లాక్‌డౌన్ సడలింపు: హైదరాబాదులో ప్రయాణికులకు ఆటోవాలాలు, క్యాబ్‌ల చార్జీల బాదుడు

లాక్ డౌన్ సడలింపుతో రోడ్డెక్కిన ఆటోలు, క్యాబ్ లు అడ్డుగోలు దోపిడీకి తెరలేపాయి. సాధారణ రోజల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేసే ఆటోవాలాలు కరోనా కాలాన్ని మరింత క్యాష్ చేసుకుంటున్నారు. నగరంలో బస్సులు నడవకపోవడంతో ఇదే అదునుగా తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని తమ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు.
 
లాక్ డౌన్ నిబంధనలను సడలించడంతో ప్రజల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. దూర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు, రైళ్లల్లో వచ్చే ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌ల పైనే ఆధారపడాల్సి వస్తుంది. ఇదే అదనుగా హైదరాబాదు నగరంలో ఆటోవాలాల దోపిడీ యథేచ్చగా కొనసాగుతోంది. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే సుమారు 500 నుండి 1000 రూపాయలు వరకు వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
 
ఇక ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తే 1500 రూపాయలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. సాధారణ సమయంలో ఉప్పల్ రింగ్ రోడ్డు నుండి సికింద్రాబాద్ వరకు గతంలో 150 తీసుకుంటే ప్రస్తుతం 500 తీసుకుంటున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. ఆటోవాలాలు అధిక డబ్బులు వసూలు చేస్తుండడంతో ప్రతిరోజు తిరిగే ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
 
మరోవైపు క్యాబ్ వాళ్లు కూడా అదేవిధంగా డబ్బులను దండుకుంటున్నారని తెలుపుతున్నారు. మొత్తంలో కరోనాతో ఇప్పటికి ఆర్థిక ఇబ్బంధులు పడుతున్న ప్రయాణికులు ఆటోల చార్జీలతో మరింత ఇబ్బంధి పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి నిబంధనలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడపాలని కోరుతున్నారు.