శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (16:25 IST)

ఫ్యాక్ట్ చెక్ :: 25 నుంచి మళ్లీ లాక్డౌన్ ... క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

దేశంలో కరోనా వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ఈ నెల 25వ తేదీ నుంచి మళ్లీ లాక్డౌన్ విధించనున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఈ వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఫ్యాక్ట్ చెక్ చేసిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దీనిని తప్పుడు వార్తగా నిర్ధారించి ‘ఫేక్ న్యూస్’ అలెర్ట్‌లో పోస్టు చేసింది. 
 
కాగా, ప్రస్తుతం దేశంలో రోజుకు కనీసం 80 వేలకు తగ్గకుండా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ నెల 25 నుంచి దేశవ్యాప్తంగా మరోమారు లాక్డౌన్ విధించబోతున్నారంటూ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ) పేరుతో ఓ సర్క్యులర్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ సర్క్యులర్‌లో "కరోనా వైరస్ మరణాల రేటు దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సెప్టెంబరు 25 నుంచి దేశవ్యాప్తంగా 46 రోజులపాటు కఠిన లాక్డౌన్‌ను అమలు చేయాలని ప్లానింగ్ కమిషన్‌తో కలిసి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే, అత్యవసర వస్తువులను మాత్రం అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. 
 
ఈ మేరకు ఇందుకు అనుగుణంగా సిద్ధమవుతారన్న ఉద్దేశంతో ఎన్‌ఎండీఏ ముందస్తు నోటీసు జారీ చేసింది" అని ఈ నెల 10వ తేదీన ఈ సర్క్యులర్ జారీ అయినట్టుగా ఉంది. దీనిపై ప్రభుత్వ అధికారిక మీడియా అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. మరోమారు లాక్డౌన్‌పై ఎలాంటి సర్క్యులర్ జారీకాలేదనీ, ఈ సర్క్యులర్ పూర్తిగా ఫేక్ అంటూ తేల్చి చెప్పింది.