సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 9 అక్టోబరు 2018 (21:54 IST)

హైదారబాదులో దొంగ.. దొంగది.. దొరికితే కళ్లలో కారం చల్లేస్తారు...

యువతీయువకుడు కలిసి చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఘటన హైదారబాదులో వెలుగు చూసింది. సినీ ఫక్కీలో చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న వీరిద్దరినీ ఎల్‌బీ నగర్‌ సీసీఎస్, యాచారం పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా సూర్యపేటకు చెందిన నందిపాటి వినోద్‌(25) డిగ్రీ చదువు మధ్యలోనే ఆపేశాడు. బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చిన ఇతను సరూర్‌ నగర్‌లోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. 
 
2015లో శివశక్తి గ్యాస్‌ ఏజెన్సీ గోదాములో ఇన్‌చార్జిగా చేరాడు. అక్కడ తప్పుడు లెక్కలు చూపించి అక్రమాలకు పాల్పడటంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. అనంతరం కర్మన్‌ఘాట్‌లోని ఐశ్వర్య గ్యాస్‌ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా చేరి గోదాము ఇన్‌చార్జిగా పదోన్నతి పొందాడు. అక్కడ కూడా అక్రమాలకు పాల్పడటంతో అతడిని విధుల నుంచి తొలగించడంతో కర్మన్‌ఘాట్‌ జనప్రియ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. 
 
తపోవన్‌ కాలనీలో ఉండే గోవూరి కీర్తి(23) అతడితో సన్నిహితంగా ఉండేది. ఇద్దరూ ఒంటరిగా ఉన్న వృద్ధులను మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. అవసరమైతే మహిళల కళ్లలో కారం చల్లి, కత్తితో బెదిరించి స్నాచింగ్‌కు పాల్పడేవారు. ఈమధ్య కాలంలో చైన్ స్నాచింగ్ కేసులు పెరిగిపోవడంతో పోలీసలు నిఘా పెంచారు. సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలిస్తూ, బైక్‌లపై వెళ్లే అనుమానితుల సమాచారం సేకరించారు. సోమవారం ఉదయం ఈ నిందితులిద్దరూ బైక్‌పై యాచారం వైపు వెళుతున్నారు. సమాచారం అందుకున్న సీసీఎస్‌ పోలీసులు వారిని అనుసరించి వాళ్ల వ్యవహార శైలిని కనిపెట్టేశారు. దీనితో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.