శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (12:04 IST)

మేడారం జాతరకు వేళాయె.. బంగారంగా బెల్లం సమర్పణ.. భారీ ఏర్పాట్లు

రెండేళ్లకు ఒకసారి వచ్చే వనదేవతల సంబరం మేడారం జాతరకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ జాతర జరుగుతోంది. ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌ నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు.

మూడు రోజుల వేడుకల్లో పాల్గొని సమ్మక్క సారక్కలను దర్శించుకుంటారు. అయితే దేశంలో ఎక్కడి నుంచైనా చేరుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ట్రాఫిక్‌ లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. 
 
తెలంగాణ ఇలవేల్పు, వనదేవతలు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు పది లక్షల మంది తరలివస్తారని తెలుస్తోంది. మేడారం వచ్చిన భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసిన అనంతరం అమ్మవార్లకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. వాగులో పుణ్యస్నానాలు చేసి వనదేవతల మొక్కులు తీర్చుకుంటే భక్తుల కోరికలను అమ్మవార్లు తీరుస్తారని వారి నమ్మకం. అమ్మవారికి బంగారంగా బెల్లాన్ని సమర్పించి మొక్కు తీర్చుకుంటారు. 
 
ఇకపోతే ఈ నెల 5వ తేది బుధవారం జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది. ఆ రోజున అమ్మలగన్న అమ్మ సారలమ్మని కోయ పూజారులు డప్పు సప్పుల్లతో, కోయ సాంప్రదాయలతో అమ్మ వారిని గద్దె మీదకు తీసుకొస్తారు. ఇక 6వ తేదీన అదే కోయ పూజారులు ఘనంగా సమ్మక్కను గద్దె మీద ప్రతిష్టిస్తారు. 7వ తేదీన భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో వారి మొక్కుల చెల్లించి అమ్మవార్లను దర్శించుకుంటారు. 8వ తేదీన అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేస్తారు.