హైదరాబాద్‌లో పెరుగుతున్న అనుమానితులు... చైనాలో మరణ మృదంగం
హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. జ్వరం, జలుబు, తలనొప్పి వంటి వాటితో బాధపడుతున్న వారు తమకు కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఆస్పత్రిలకు క్యూకడుతున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో కరోనా అనుమానితులు పెరుగుతున్నారు.
పరీక్షల కోసం నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి తరలివస్తున్నారు. గత నెల 25 నుంచి మొన్నటి వరకు 18 మంది అనుమానితులకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. నిన్న మరో ఇద్దరు అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు. నాదర్‌గుల్‌కు చెందిన 42 ఏళ్ల మహిళతోపాటు కూకట్‌పల్లికి చెందిన 32 ఏళ్ల వ్యక్తికి పరీక్షలు నిర్వహించారు.
వీరిద్దరూ ఇటీవలే చైనా నుంచి నగరానికి చేరుకున్నారు. వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. వారిలో వైరస్ ప్రభావం కనిపించలేదని తెలిపారు. అయినప్పటికీ వారి నమూనాలు సేకరించి పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి పంపారు. ప్రస్తుతం మరో ముగ్గురు అనుమానితులు ఐసోలేషన్ వార్డులో ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
మరోవైపు, చైనాలో కరోనా వైరస్ ధాటికి చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతంది. ఇప్పటికే 450 మందికి పైగానే మరణించినట్టు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. సోమవారం ఒక్కరోజే మరో 3,500 మందికి వైరస్ సోకినట్టు అధికారులు నిర్ధారించారు. వీరందరినీ ఐసొలేషన్ వార్డులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు.
మొత్తంగా దాదాపు 20 వేల మందికి పైగా వైరస్ బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్సను పొందుతున్నారు. వీరిలో సుమారు 400 మందిని డిశ్చార్జ్ చేసినట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి. మిగతా వారంతా వైరస్ తో బాధపడుతున్నారని, వారికి పూర్తి స్థాయిలో వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు.
కాగా, కరోనా వైరస్ ఇప్పటికే 24 దేశాలకు విస్తరించింది. ఎన్నో దేశాలు విదేశాల నుంచి, ముఖ్యంగా చైనా నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక నిఘాను పెట్టాయి. ఇండియాకు చైనా నుంచి వస్తున్న వారిని రెండు వారాల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలని నిర్ణయించిన కేంద్రం న్యూఢిల్లీలో ప్రత్యేక వార్డులను సైన్యం పర్యవేక్షణలో నిర్మించిన సంగతి తెలిసిందే.
చైనా నుంచి వచ్చే వారందరినీ అక్కడికి తరలించి, 14 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి, వారిలో వైరస్ లేదని తేలిన తరువాత మాత్రమే బాహ్య ప్రపంచంలోకి పంపుతున్నారు. మరోవైపు, కేరళ ప్రభుత్వం స్టేట్ హై అలర్ట్‌ను ఇప్పటికే ప్రకటించింది. దేశంలో మూడో కరోనా కేసు వెలుగులోకి రాగా, వారి కుటుంబీకులందరినీ ఐసొలేషన్ వార్డులకు తరలించారు.