తెలంగాణలో వ్యాక్సిన్ తొలి డోసు ప్రక్రియ నిలిపివేత?
హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్ టీకా డోసుల కొరత దృష్ట్యా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేపటి నుంచి కోవిడ్ టీకా రెండో డోసు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ వరకు కరోనా టీకా మొదటి డోసు ఆపేస్తున్నట్లు వెల్లడించింది. రెండో డోసు తీసుకోవాల్సిన వారు 11 లక్షల మంది ఉన్నారని ఆరోగ్య శాఖ తెలిపింది.
గతంలోనే దాదాపు 30 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు కావాలని సీఎస్ సోమేశ్‌కుమార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పటివరకు రాష్ట్రానికి కేవలం 15 నుంచి 16 లక్షల డోసులు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డోసుల కొరత కారణంగా ఇప్పటికే మూడు, నాలుగు సార్లు వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆరోగ్య శాఖ నిలిపివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఏర్పడటంతో రెండో డోసు వేసుకోవాల్సిన వారి సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తొలి డోసు ప్రక్రియను నిలిపివేస్తూ కేవలం రెండో డోసు మాత్రమే వేయాలని తాజాగా ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది.