తేనీరులో మత్తుపదార్థం కలిపి.. పనిమనిషిపై బలాత్కారం చేశారు.. ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో దారుణం జరిగింది. చుట్టపు చూపుగా వచ్చిన కొందరు బంధువులు ఆ ఇంట్లో పని చేస్తున్న పనిమనిషిపై అత్యాచారానికి తెగబడ్డారు. టీ లో మత్తుమందు కలిపి లైంగికదాడికి పాల్పడ్డారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగరంలోని టీచర్స్ కాలనీకి చెందిన ఓ మహిళ ఇంట్లో ఓ మహిళ పాచిపని చేస్తూ వస్తోంది. ఈ నెల 13న ఆమె ఇంటికి కొందరు బంధువులు వచ్చారు. అయితే, వారికి ఆ ఇంట్లో పనిచేసే పనిమనిషిపై కన్నుపడింది.
దీంతో, ఇంటి యజమాని సాయంతో టీలో మత్తు కలిపి బంధువుల్లో ఒకడైన సయ్యద్ హుస్సేన్ అనే వ్యక్తి పనిమనిషిపై అత్యాచారం చేశాడు. దారుణం ఏమిటంటే, ఇంటి యజమాని ఆ దారుణాన్ని వీడియో తీసింది.
దీని తర్వాత డబ్బులు ఇవ్వాలంటూ పనిమనిషిని బెదిరించింది. డబ్బు ఇవ్వకపోతే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించింది. దీంతో పనిమనిషి పోలీసులను ఆశ్రయించింది.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సయ్యద్ హుస్సేన్ ను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. ఇంటి యజమాని కళావతి గతంలో కూడా ఓ వ్యాపారిని ఇలాగే ట్రాప్ చేసి రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.