శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2019 (18:52 IST)

తెలంగాణాలో నిండు గర్భిణిని కాటేసిన మానవమృగం

తెలంగాణ రాష్ట్రంలో ఓ మానవమృగం నిండు గర్భిణిని కాటేసింది. మరికొన్ని రోజుల్లో ప్రసవించబోతున్న గర్భిణిపై కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని బొమ్మకల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. ఈయన భార్య నిండు గర్భిణి. దీంతో ఆమె ఇంట్లోనే ఉంటోంది.
 
ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీన కనపర్తి రామకృష్ణ అనే వ్యక్తి డిష్ రిపేరింగ్ పేరిట ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఆ గర్భిణి ఒక్కటే ఇంట్లో ఉన్నది. ఇదే అదునుగా భావించిన ఆ వ్యక్తి నిండు గర్భిణి అని కూడా చూడకుండా లైంగికదాడికి పాల్పడ్డాడు. 
 
వారిద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో ఆమె పుస్తెల తాడు కూడా తెంపేశాడు. ఇంతలో డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చిన భర్తకు భార్య ఆందోళనకరంగా కనిపించింది. పుస్తెల తాడు కూర్చడం చూసి ఏమైందని అడిగాడు. దీంతో భార్య తనపై జరిగిన పాశవిక దాడి గురించి చెప్పింది. 
 
ఈ విషయం బయటకు పొక్కితే పరువు పోతుందని ముందుగా భావించిన కుటుంబం ఆ తర్వాత పోలీసుల్ని ఆశ్రయించింది. అయితే నిందితుడు అత్యాచారం చేసిన సమయంలో సెల్‌ఫోన్‌లో వీడియో కూడా తీసినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.