గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 అక్టోబరు 2020 (08:58 IST)

కూలీ పనివుందని నమ్మించి తీసుకెళ్లి బలాత్కారం .. ఆపై హత్య... ఎక్కడ?

ఓ మహిళ గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా చంపేశాడు. తలపై బండరాయితో మోది హత్య చేశాడు. కూలీపని వుందని చెప్పడంతో ఆ మహిళ ఆ వ్యక్తిని నమ్మి.. అతని వెంట వెళ్లింది. ఆ తర్వాత సాయంత్రం ఇంటికి రాకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ మహిళ హత్యకు గురైనట్టు గుర్తించారు. నమ్మించి తీసుకెళ్లిన వ్యక్తే ఆమెపై అత్యాచారం జరిపి, ఆపై తలపై బండరాయితో మోది హత్య చేసివుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ దారుణం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మెదక్‌ జిల్లా, వెల్దుర్తి మండలం, రామంతాపూర్‌ తండాకు చెందిన విజయ (22)కు ఎనిమిదేళ్ళ క్రితం వివాహం కాగా, ఆమె మనస్పర్థల కారణంగా భర్త దూరమయ్యాడు. 
 
ఈ క్రమంలో ప్రతి రోజూ రైలులో వచ్చి మేడ్చల్‌ పట్టణంలో అడ్డా కూలీగా పనిచేస్తుంది. ఇందులోభాగంగా ఈ నెల 17న ఉదయం రైలులో మేడ్చల్‌కు వచ్చి కూలీ అడ్డా వద్ద వేచివుంది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పని ఉందని ఆమెను తీసుకెళ్లాడు. 
 
అయితే.. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు 18న మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 
 
కాగా... సోమవారం ఉదయం మేడ్చల్‌ పట్టణంలోని రైల్వే గేటు సమీపంలో ఓ మహిళ మృతి చెంది ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి.. అదృశ్యమైన విజయదిగా గుర్తించారు. 
 
తలపై రాయితోమోది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.. ఆమెను కూలీ అడ్డా  నుంచి తీసుకువెళ్లి.. లైంగికదాడికి పాల్పడి.. ఆపై హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కూలీ అడ్డా నుంచి ఆమెను తీసుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.