శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సందీప్ రేవిళ్ల
Last Modified: శుక్రవారం, 8 మార్చి 2019 (15:59 IST)

చెవిలో ఇయర్ ఫోన్... నాంపల్లి రైల్వేస్టేషన్ పట్టాలు దాటుతూ మహిళ...

ఓ మహిళ నిర్లక్ష్యం తన ప్రాణాలను తీసింది. చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈ ఘటన నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన రేఖా మహల్‌(25) టెలిఫోన్‌ భవన్‌ ఎదురుగా ఉన్న హాస్టల్‌లో ఉంటూ లక్డీకాపూల్‌లోని గ్లోబల్‌ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. 
 
గురువారం ఉదయం జిమ్‌కు వెళ్లి హాస్టల్‌కి తిరిగి వస్తుండగా మధ్యలో రైలు పట్టాలు దాటవలసి వచ్చింది. పట్టాల వద్ద ఉన్న చెక్ పోస్ట్ దాటి లోపలికి ప్రవేశించింది. బేగంపేట నుంచి నాంపల్లి వైపుకు వెళ్లే రైలు వెళ్లిపోవడంతో లైన్ క్లియర్ అయిందని భ్రమపడింది. కానీ మరో రైలు వస్తోందని గమనించలేదు. 
 
ఇంతలో నాంపల్లి నుండి లింగంపల్లి వైపు వెళ్తున్న ఎంఎంటీఎస్‌ రైలును చూసుకోకుండా పట్టాలు దాటడానికి ముందుకు నడిచింది. రైలు ఢీకొట్టి క్రిందపడిపోయింది. స్థానికులు పోలీసుల సహాయంతో ఆమెను గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలవడంతో ఆ మహిళ అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు.