మంగళవారం, 22 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By SELVI.M

"స్వాతిముత్యం" విశ్వనాథ్ దర్శకత్వంలో శృతిహాసన్..!?

సాగరసంగమమం, స్వాతిముత్యం వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ డైరక్షన్‌లో "శృతిహాసన్" నటించబోతుందని తెలిసింది. పద్మభూషణ్, దశావతారం హీరో కమల్ హాసన్ కుమార్తె అయిన శృతిహాసన్ బాలీవుడ్ సినిమా "లక్"లో హీరోయిన్‌గా పరిచయమైంది.

సినీరంగంలో బాలనటిగా, గాయనిగా, కథానాయికగా తన హవాను కొనసాగించిన శృతిహాసన్ తాజాగా తన తండ్రి నటించి నిర్మాణ సారథ్యం వహించిన "ఈనాడు" సినిమాకు సంగీత దర్శకురాలిగా మారింది.

పలు మ్యూజిక్ ఆల్బమ్‌లు రూపొందించిన శృతిని.. తనకు మంచి క్రేజ్ చిత్రాలిచ్చిన విశ్వనాథన్ దర్శకత్వంలో నటింపజేయాలని కమల్‌హాసన్ ఉవ్విళ్లూరుతున్నారని సమాచారం.

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తనయ సౌందర్య నిర్మిస్తున్న "సుల్తాన్ ది వారియర్"లో కూడా పాటలు పాడిన శృతి.. తాజాగా అల్లరి నరేష్‌తో.. విశ్వనాథ్ దర్శకత్వం వహించే చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.

మరోవైపు.. ప్రముఖ దర్శకుడు, కె. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ దర్శకత్వంలో, క్రేజీ హీరో సిద్ధార్థ కథానాయకుడుగా నటిస్తున్న మరో చిత్రంలోనూ శృతి కథానాయిక పాత్రను పోషిస్తుందనే వార్తలు కూడా విన్పిస్తున్నాయి. మొత్తానికి శృతిహాసన్ త్వరలో టాలీవుడ్ కథానాయికగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నమాట..!.